T.Congress: రెండుగా చీలిపోయిన తెలంగాణ-కాంగ్రెస్‌.. కీలక సమావేశానికి సీనియర్లు డుమ్మా.. ఆ పార్టీ నుంచి వచ్చినవారంతా రాజీనామా..

|

Dec 18, 2022 | 6:07 PM

ఎగ్జిక్యూటీవ్ సమావేశానికి నిన్న తిరుగుబాటు చేసిన ఒక్క సీనియర్ కూడా హాజరుకాలేదు. ఏ ఒక్కరైనా వస్తారనే గంపెడాశతో వున్న రేవంత్ వర్గం నాయకులు..

T.Congress: రెండుగా చీలిపోయిన తెలంగాణ-కాంగ్రెస్‌.. కీలక సమావేశానికి సీనియర్లు డుమ్మా.. ఆ పార్టీ నుంచి వచ్చినవారంతా రాజీనామా..
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ నిట్టనిలువునా చీలిపోయింది. రేవంత్ శిబిరం వర్సెస్ సీనియర్ల శిబిరంలా తయారై టోటల్‌గా వ్యవహారం రచ్చరంబోలా అవుతోంది. ఇందిరాభవన్‌లో రేవంత్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిక్యూటీవ్ సమావేశానికి నిన్న తిరుగుబాటు చేసిన ఒక్క సీనియర్ కూడా హాజరుకాలేదు. ఏ ఒక్కరైనా వస్తారనే గంపెడాశతో వున్న రేవంత్ వర్గం నాయకులు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారిలో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. పైకి మాత్రం ఇంకా సమయం వుంది.. వస్తారు. వస్తారంటూ రేవంత్ వర్గం నాయకులు మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు..

మీటింగ్‌కు వచ్చే ప్రశ్నే లేదని సీనియర్లు భీష్మించుకుని కూర్చోవడంతో రేవంత్‌ వర్గం అత్యంత దైన్య స్థితిలో పడిపోయినట్టు కనిపిస్తోంది. నిన్న రేవంత్ ఒంటెద్దుపోకడపై కాంగ్రెస్ సీనియర్లు మండిపడ్డారు.. ఇక ఇవాళ తలపెట్టిన ఎగ్జిక్యూటీవ్ మీటింగ్‌కు సీనియర్లు ఎవరూ రావడం లేదని తెలుసుకున్న పలువురు రేవంత్ వర్గం నాయకులు మీటింగ్‌ హాల్లోకి వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ సీనియర్లపై శివాలెత్తారు.

రేవంత్‌ మీటింగ్‌కు హాజరైన సీనియర్‌ నేత జానారెడ్డి. పార్టీలో సంక్షోభంపై స్పందించారు సీనియర్‌ నేత జానారెడ్డి. తాను ఏదీ బహిరంగంగా మాట్లాడను అంటూ స్పష్టం చేశారు జానారెడ్డి. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయని జానారెడ్డి వెల్లడించారు. ఏం ఉన్నా అంతర్గతంగా చర్చిస్తామన్నారు జానారెడ్డి. కమిటీ విషయంలో గతంలో ఎన్నో గొడవలు జరిగాయన్నారు.ఇది కొత్తేమి కాదన్నారు జానారెడ్డి.

అయితే ఇదే అంశంపై సీనియర్ లీడర్‌ నాగం జనార్దన్ రెడ్డి స్పందించారు. తాను కూడా సీనియర్ లీడర్‌నే అని నాగం జనార్దన్ రెడ్డి వెల్లడించారు. 60 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నామన్నారు. కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.

పీసీసీ సమావేశానికి హాజరుకాని లిస్ట్‌ చూస్తే.. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, గీతారెడ్డి, మధు యాష్కి గౌడ్‌.. వీళ్లంతా డుమ్మా కొట్టారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు

వాళ్లకు పదవులు ఇవ్వొద్దని మేము అనడం లేదన్నారు వి. హనుమంత రావు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేయొద్దని అంటున్నామన్నారు. నిన్నగాక మొన్న వచ్చినోళ్లు ఒరిజినల్ కాంగ్రెస్ ఎలా అవుతారంటూ ఆయన ప్రశ్నించారు. కొన్నాళ్లు పనిచేశాక పదవులిస్తే అభ్యంతరం ఉండదన్నారు. సోనియాగాంధీ కూడా ఓడినప్పుడు సమీక్ష జరిపారు.. మునుగోడులో ఓటమిపై ఎందుకు సమీక్ష చేయరని ప్రశ్నించారు.

దేశంలో సగం కంటే ఎక్కువ ఓబీసీ జనాభా ఉన్నారు. జనాభా లెక్కల సేకరణలో కుల గణన చేపట్టాలన్నారు. వాటికి అనుగుణంగా ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. క్రీమీ లేయర్ ఎత్తేయాలని, ఓబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాను ఈనెల 20న కాంస్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశానన్నారు. దీనికి అన్ని పార్టీలకు ఆహ్వానం. ఓబీసీ ప్రధాని మోదీ కూడా మా విన్నపాన్ని అర్ధం చేసుకోవాలన్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం