Telangana Congress: రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌కు అచ్చే దిన్ ఎప్పుడు.. అసలు పార్టీకి ప్రాణం పోసేది ఎవరు..?

సిమిలర్ సింబల్స్‌ దెబ్బకొట్టినా కారు స్పీడు తగ్గలేదు. టీఆర్ఎస్ విజేతగా నిలిచింది. ఇటు కాంగ్రెస్ హస్తం మాత్రం చితికిపోయింది. ఏకంగా డిపాజిట్‌ కోల్పోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. ఇండియన్‌ మోస్ట్‌ సీనియర్‌ పొలిటికల్‌ పార్టీకి.. అసలెందుకీ పరిస్థితి? కాలం కలిసిరావడం లేదనా? నేతలు కలిసి సాగడం లేదా? మునుగోడు బైపోల్‌లో కళ్లు బైర్లుగమ్మే రిజల్ట్‌ చూశాక.. సగటు కాంగ్రెస్‌ అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్నలివి.

Telangana Congress: రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌కు అచ్చే దిన్ ఎప్పుడు.. అసలు పార్టీకి ప్రాణం పోసేది ఎవరు..?
Telangana Congress

Updated on: Nov 07, 2022 | 10:45 AM

కాంగ్రెస్‌ కథ మారలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హస్తం హస్తవాసి ఏమాత్రం మారలేదని వాదన. అయితే.. ఎన్నిక ఏదైనా ఓటమే తన గమ్యమన్నట్టుగా తయారైంది వృద్ధ పార్టీ. పేరుకే తెలంగాణ ఇచ్చిన పార్టీ.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఎన్నికలోనూ సత్తా చాటింది లేదు. 2014 నుంచి పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. 2018 తర్వాత జరిగిన హుజుర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జున్‌ సాగర్‌,హుజురాబాద్.. ఇలా ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా ఉసూరుమనిపించింది. తాజాగా మునుగోడులో అదే తీరు ఫలితాలను మూటగట్టుకుంది. ఏ రౌండుచూసినా ఏడున్నది కాంగ్రెస్‌.. అన్నట్టుగా ఉన్నాయి హస్తం పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య. మొత్తంగా కలిపితే 20వేల ఓట్లు సాధించేందుకు కూడా అపసోపాలు పడాల్సిన దుస్థితి. దీనికి స్వయంకృతాపరాధమే కారణమన్నది విశ్లేషకుల మాట.

చెప్పాలంటే మునుగోడు.. బీజేపీ సీటు కాదు. టీఆర్‌ఎస్‌ సీటూ కాదు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిగా కాంగ్రెస్‌ గెలిచిన సీటు. ఆ రాజగోపాల్‌రెడ్డే పార్టీకి రాంరాం చెప్పేసి వెళ్లిపోవడంతో.. పరిస్థితి ఇలా తయారైంది. ఆయన వెంట మొత్తం వెళ్లకపోయినా.. మెజార్టీ స్థాయిలో క్యాడర్‌ మాత్రం కదిలివెళ్లిందన్నది మాత్రం కాంగ్రెస్‌ గ్రహించాల్సిన కఠినవాస్తవం. దీంతో, ఆ పార్టీకి నష్టం తప్పలేదు.

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను వ్యతిరేకిస్తూ.. ఆ వెంటనే చండూరులో టీపీసీసీ, ఓ రేంజ్‌లో మీటింగ్‌ అరేంజ్‌ చేసినా… అదేం పెద్ద ప్రభావం చూపలేదు. పైపెచ్చు, ఆ మీటింగ్‌కు డుమ్మాకొట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్‌ వాడిన భాష ఆ పార్టీని భారీ డ్యామేజే చేసింది.

ఇక, అభ్యర్థిత్వం కోసం లోకల్‌గా చెలిమల కృష్ణారెడ్డిలాంటి గట్టి నేతలు పోటీపడినా.. ఆడబిడ్డగా భావించి పాల్వాయి స్రవంతినే క్యాండిడేట్‌గా ప్రకటించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. అందరి కన్నా ముందే.. అభ్యర్థిని ప్రకటించి ఉత్సాహం చూపిన కాంగ్రెస్‌కు.. ఆ సెంటిమెంటూ వర్కవుట్‌ చేసుకోలేకపోయింది. ఎంత హడావుడి చేస్తే ఏంలాభం.. డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.

దశాబ్దాలుగా వెన్నంటి ఉన్న సంప్రదాయ ఓట్లనూ కూడా కాపాడుకోవడంలో విఫలమైంది. పార్టీలో ఇంటర్నల్‌ ఫైటింగ్‌ దెబ్బకు.. హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్ కూడా తలో దిక్కు చూసుకున్నారు. దెబ్బకు కాంగ్రెస్‌ ఓట్లన్నీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ముక్కలు,చెక్కలైపోయాయి.

ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎపిసోడ్‌..

ఇంతకాలం ఎలా ఉన్నా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌ కొంపముంచిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పార్టీని పక్కనబెట్టి తన తమ్ముడికి సపోర్ట్‌ చేయాలంటూ కార్యకర్తలతో కోమటిరెడ్డి మాట్లాడిన ఆడియో పెద్ద సంచలనంగా మారింది. ఇందులో కాంగ్రెస్‌ గెలిచేది లేదు, సచ్చేది లేదు అంటూ ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడిన వీడియో.. మీడియా, సోషల్‌ మీడియాల్లో వైరల్‌ కావడం కాంగ్రెస్‌ను మరింత కుంగదీసింది.

కాంగ్రెస్ శ్రేణులన్నీ అక్కడే..

ఇక,కరెక్టుగా ఇదే టైమ్‌లో.. భారత్‌జోడో అంటూ అగ్రనేత రాహుల్‌ చేపట్టిన పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించడంతో  కాంగ్రెస్‌ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ముఖ్య నేతలంతా రాష్ట్రంలో సాగుతున్న రాహుల్‌ పాదయాత్రపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. పాపం.. పాల్వాయి స్రవంతి దాదాపు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. ప్రధాన పోటీదారులుగా మారిన టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నిలదొక్కుకోలేకపోయారు. అయితే, ఈ ఓటమికి కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న రీజన్స్ మాత్రం వేరేలా ఉన్నాయి.

ఏదేమైనా.. ఈ దెబ్బతో తెలంగాణలో కాంగ్రెస్‌ కథ కంచికి చేరినట్టేనా..? అన్న అభిప్రాయాలు పొలిటికల్‌ కారిడార్‌లో షికారు చేస్తున్నాయి. కవర్‌ చేయలేని స్థాయిలో జరిగిన ఈ డ్యామేజ్‌ని.. కాంగ్రెస్‌ ఎలా తట్టుకుంటుంది..? మళ్లీ ఏనాటికి పూర్వవైభవం సాధిస్తుంది..? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం