Telangana Congress PAC Meeting: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ నేతల రాజకీయ వ్యవహారాలు (పీఏసీ) కమిటీ భేటీ గాంధీ భవన్ లో జరగనుంది. రాజకీయ వ్యవహారాలు, పార్టీలో చేరికలు, యాత్రలు, ఎన్నికల సభలు, మేనిఫెస్టోతో పాటు సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లపై చర్చ జరగనుంది. అలాగే పార్టీలో అంతర్గత సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నిర్వహించే బస్సు యాత్ర, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, ప్రియాంకా గాంధీతో నిర్వహించబోయే కొల్లాపూర్ సభపై కూడా పీఏసీ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.
సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు.
అయితే, పీఏసీ భేటీకి ముందు ఎన్నికల కమిటీ జాబితా తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి రాజేసింది. సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్‌తో పాటు పలువురు నేతలకు ఎన్నికల కమిటీలో చోటు కల్పించలేదు. దీంతో ఆ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం శ్రమిస్తున్నా గుర్తింపు లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న తమను కాదని బయటి నుంచి వచ్చిన నేతలకు పదవులివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల కమిటీలో చోటు దక్కకపోవడంపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. త్వరలో అనుచరులతో సమావేశం కాబోతున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని సమాచారం. ఆయన అనుచరులు మాత్రం సరైన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తున్నారు. పొన్నం బాటలో మరికొంతమంది నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఓ వైపు చేరికలతో పార్టీలో జోష్ కనిపిస్తోంది. మరోవైపు అసంతృప్తి జ్వాల అంతకంతకు పెరగడం కేడర్‌ని ఆందోళనలో పడేస్తోంది. పీఏసీ భేటీలో నేత అసంతృప్తిపై చర్చ జరిగే అవకాశం ఉంది. వారిని ఎలా బుజ్జగిస్తారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..