అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమై గత నెల 18 నుంచి 25 వరకు వచ్చిన 1006 దరఖాస్తులపై చర్చించింది. దరఖాస్తులు ఆహ్వానించిన తర్వాత సమావేశమైన కమిటీ, నియోజకవర్గాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో జాబితాను రెడీ చేసింది. నియోజకవర్గాల వారీగా ఆర్జీలను వేరు చేసి, రిజర్వేషన్ నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను..రిజర్వేషన్ కానీ జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని వేర్వేరుగా పరిశీలించింది. బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేసి కమిటీ పరిశీలించిందన్నారు రేవంత్ రెడ్డి. బీసీలకు ఈసారి పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలకు మరో వారం, పది రోజుల సమయం పట్టే అవకాశముంది.
పీఈసీ ఇచ్చే నివేదికపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు పీఈసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ విడివిడిగా చర్చిస్తారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1006 దరఖాస్తులు ఆశావహుల నుంచి వచ్చాయ్. వీటన్నింటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..