Telangana Congress: టీ కప్పులో తుఫానా? లేక చినికిచినికి పెనుతుఫానుగా మారే గాలివానా? డిగ్గీరాజా పర్యటనతో తెలంగాణా నేతల తీరుమారేనా?

| Edited By: Ram Naramaneni

Dec 23, 2022 | 8:48 PM

పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దాలంటూ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ రంగంలోకి దింపింది. డిసెంబర్ 20వ తేదీన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ అనుసంధాన కర్తగా వెళతారని ఏఐసీసీ ప్రకటించింది.

Telangana Congress: టీ కప్పులో తుఫానా? లేక చినికిచినికి పెనుతుఫానుగా మారే గాలివానా? డిగ్గీరాజా పర్యటనతో తెలంగాణా నేతల తీరుమారేనా?
Follow us on

డిగ్గీ రాజా.. తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రమై.. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిక స్పష్టంగా కనిపించిన తరుణంలో అధిష్టానం పంపగా అనుసంధానకర్తగా హైదరాబాద్ వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజా పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని చిన్న వివాదంగా కొట్టి పారేశారు. రెండు రోజులపాటు పదుల సంఖ్యలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఢిల్లీకి తిరిగి వెళుతూ పార్టీలో ఉన్న చిన్నా చితక భిన్నాభిప్రాయాలు త్వరలోనే సర్దుకుంటాయని తేల్చి పారేశారు. అయితే పార్టీలో నెలకొన్న సంక్షోభం టీ కప్పులో తుఫానా? లేక చినికి గాలి వానగా మారే పెను తుఫానా? అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలనున్నది. డిసెంబర్ 10వ తేదీన ఏఐసీసీ అనుమతితో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని, రాజకీయ వ్యవహారాల కమిటీ యంత్రాంగాన్ని, పలు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని ప్రకటించారు. ఆ వెంటనే పార్టీలో అసమ్మతి రాజుకోవడం ప్రారంభమైంది. కమిటీల ప్రకటన వెలువడిన వెంటనే నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి అనునయించారు. కానీ ఆ మర్నాటి నుంచి పార్టీలో క్రమక్రమంగా అసంతృప్తివాదులు తెరమీదకి రావడం మొదలయ్యింది. కీలక నాయకుల ఇళ్లల్లో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశాలు నిర్వహించడం ప్రారంభమైంది. కమిటీల కూర్పు పై మంతనాలు జరుపడం జోరందుకుంది. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లాంటివారు ఒకటి, రెండు రోజులపాటు సమావేశాలు జరిపి ఆ తర్వాత మీడియాకు ఎక్కారు. పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్న వారిని కాదని రేవంత్ రెడ్డి వెంట టిడిపి నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని ఆయన ధ్వజమెత్తారు. రాజనర్సింహ మాట్లాడిన తర్వాత మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కారు. అధ్యక్షునితో సమాన హోదా కలిగిన సీఎల్పీ నేతనైన తనకు కూడా నామమాత్రం చెప్పకుండా పిసిసి కమిటీలను ఏర్పాటు చేశారని, తన అభిప్రాయాన్ని కనీసం అడగలేదని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా కొనసాగుతుండగానే జి-9 కాంగ్రెస్ నేతల బృందం సమావేశమై రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన బహిరంగంగా అక్కసు వెళ్ళగక్కింది. టిడిపి నుంచి వలస వచ్చిన వారికి పెద్ద పీట వేసారంటూ వీరు కామెంట్ చేయడం పార్టీలో వివాదానికి దారి తీసింది. సీనియర్ల వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి వెంట టిడిపి నుంచి వచ్చిన 12 మంది నేతలు తమకు కాంగ్రెస్ పార్టీలో సంక్రమించిన పదవులను వదులుకొని నిరసన వ్యక్తం చేశారు. గత ఆరేడు సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తూ ఉంటే ఇంకా తమని వలసవాదులనడం బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీతక్క అయితే ఏకంగా డిగ్గీ రాజా దగ్గర తన బాధను ఏకరువు పెట్టారు. జి-9 కాంగ్రెస్ నేతల తరుపున టిపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తదితరులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. రేవంత్ రెడ్డి హయాంలో పార్టీ మరింత బలహీనమవుతుందని ఆరోపణలు చేశారు. వీరిద్దరిపై రేవంత్ రెడ్డి తరఫున మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ లాంటివారు స్పందించారు. కాంగ్రెస్ నేతలను కోవర్టులు అంటూ ఆయన సంబోధించడం పార్టీలో కొత్త వివాదానికి ఆజ్యం పోసింది.

పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దాలంటూ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ రంగంలోకి దింపింది. డిసెంబర్ 20వ తేదీన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ అనుసంధాన కర్తగా వెళతారని ఏఐసీసీ ప్రకటించింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన దిగ్విజయ సింగ్ ఢిల్లీలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణలో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రెండు రోజులపాటు హైదరాబాద్ పర్యటన ఖరారు చేసుకున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 21వ తేదీ రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. డిసెంబర్ 22, 23 తేదీలలో గాంధీభవన్లో కొన్ని గంటల పాటు సుదీర్ఘ మంతనాలు నిర్వహించిన దిగ్విజయ్ సింగ్‌, పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై వాకబు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యూహాలపై కీలక నేతల అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడి వరకు ఇదంతా బాగానే ఉన్నా.. ఒకవైపు దిగ్విజయ్ సింగ్.. గాంధీభవన్లో మకాం వేసి కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరిస్తుండగానే ఓయూ నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ యువజన నేతలు మాజీ ఎమ్మెల్యే అనిల్‌ని ఘెరావ్ చేయడంతో గాంధీభవన్ ఉద్రిక్తంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అనిల్ కోవర్టులు అని కామెంట్ చేయడాన్ని ఓయూ యువజన కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. అనిల్ సంజయిషీ కోరారు. సంజాయిషీ ఇస్తున్న సమయంలో అనిల్ కుమార్ ఉపయోగించిన పదాలను ఓయూ విద్యార్థి సంఘం నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. దాంతో గాంధీభవన్లో ఉద్రిక్తత ఏర్పడింది. రెండు వర్గాలకు సంబంధించిన శ్రేణులు తోపులాటకు పాల్పడ్డాయి. చివరకు మాజీ ఎంపీ మల్లురవి లాంటి వారు జోక్యం చేసుకొని రెండు వర్గాలను సముదాయించడంతో అప్పటికప్పుడు గొడవ సద్దుమణిగింది.

ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ రెండు రోజులపాటు కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలను సేకరించారు. రెండో రోజు ఈ కార్యక్రమం ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత వారం రోజులుగా తీవ్ర స్థాయిలో కనిపించిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలను దిగ్విజయ సింగ్ తేలిగ్గా కొట్టి పారేశారు. ఇదంతా సర్దుకుంటుందని నమ్మబలికే ప్రయత్నం చేశారు. అధిష్టానం పంపిన అనుసంధానకర్తగా తన బాధ్యత పూర్తయింది అనిపించారు. కానీ డిగ్గీరాజా చెప్పినట్లుగానే తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం సమసిపోయిందా అంటే ఇదమిత్తంగా తేల్చి చెప్పలేని పరిస్థితి. అధిష్టానం అనుసంధాన కర్తగా వచ్చిన నేత అనునయించడంతో తాత్కాలికంగా మౌనం వహించినప్పటికీ రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నాయని చెప్పాలి. అందరినీ కలుపుకొని పోయే రీతిలో రేవంత్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకుంటే సీనియర్లు ఆయనతో పాటు పనిచేసేందుకు సిద్ధమని దిగ్విజయ్ సింగ్‌కు తేల్చి చెప్పారు. దాంతో బంతి రేవంత్ రెడ్డి కోర్టులో పడింది. సీనియర్ నేతలను కలుపుకొని పోవడంలో రేవంత్ రెడ్డి ఎలాంటి లౌక్యాన్ని ప్రదర్శిస్తారన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. మరో 10 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపైకి రాకపోతే అది కచ్చితంగా బిజెపికి, బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014లోనే అధికారంలోకి రావాలని తాపత్రయపడిన కాంగ్రెస్ నేతలు గత తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగానే ఉండిపోయారు. ఇపుడు కీలక తరుణంలో తెలంగాణ కాంగ్రెస్‌లో చీలిక కనిపిస్తోంది. అంతర్గత విభేదాలు భగ్గుమన్న పరిస్థితి. ఎన్నికలు ఎంతో దూరంలో లేని సమయంలో అంతా ఒక్కతాటిపైకి రాకపోతే.. బలంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంతోపాటు తెలంగాణలో పాగా వేయాలని తహతహలాడుతున్న బిజెపిని నిలువరించడం కాంగ్రెస్ పార్టీకి అసాధ్యమని చెప్పాలి. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డితో అమీతుమీకి సిద్ధపడ్డ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి సారథ్యంలో పని చేసేందుకు ఏ మేరకు సిద్ధపడతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఒక్క పర్యటనతోనే సరిపెట్టకుండా రేవంత్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలను సమన్వయం చేసే బాధ్యతలను దిగ్విజయ సింగ్ లాంటి సీనియర్ నేతలు తమ భుజానికి ఎత్తుకుంటే మాత్రం పరిస్థితిని అదుపు చేయడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ జాతీయస్థాయిలో పలు బాధ్యతలను మోస్తున్న దిగ్విజయ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కోసం ఏ మేరకు సమయం కేటాయించగలరని పలువురు అనుమానిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌లపట్ల పలువురు తెలంగాణ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్‌ని మార్చేస్తారా అన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. అదే సమయంలో తెలంగాణ వ్యవహారాల పట్ల మరింత శ్రద్ధ చూపేందుకు, స్వయంగా తాను జోక్యం చేసుకునేందుకు ప్రియాంక గాంధీ వధేరా సిద్ధమవుతున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆమె చొరవ వల్లనే దిగ్విజయ్ లాంటి సీనియర్ నాయకున్ని తెలంగాణ వ్యవహారాలను చక్కదిద్దాల్సిందిగా పంపారని పలువురు భావిస్తున్నారు. స్వయంగా ప్రియాంక గాంధీ గనక రంగంలోకి దిగితే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సమన్వయం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో దిగ్విజయ సింగ్, ప్రియాంక గాంధీ తెలంగాణ వ్యవహారాల విషయంలో ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత త్వరగా విభేదాలు సమసిపోతాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం గుంభనంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు భవిష్యత్తులో ఎలా ప్రవర్తిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.