Congress Chintan Shivir: నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది టీపీసీసీ. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ కీసరలోని బాలవికస వేదికగా, జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో, అధ్యక్షుడు లేకుండానే ఈ సమావేశాలు జరగబోతున్నాయి. నవసంకల్ప్ చింతన్ శిబిర్ సమావేశాలకు ఏర్పాటు చేసిన కమిటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, 33 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశాలకు మొత్తం 108 మందిని ఆహ్వానించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.
ఉదయ్‌పూర్‌లో ఎఐసిసి ఏర్పాటు చేసిన మాదిరిగానే, ఇక్కడ కూడా ముఖ్య నేతలతో ఆరు అంశాలపై, ఆరు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వారి అభిప్రాయాలు తీసుకొని వాటినే కాంగ్రెస్ పాలిసిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క. ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో చేసిన తీర్మానాలను ఆమోదించడంతోపాటు, రాష్ట్ర స్థాయి అంశాలు, సమస్యలపై రోడ్ మాప్‌ను సిద్ధం చేయనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో, మొదటి రోజు మొత్తం చర్చ ఉంటుంది. రెండోరోజు ప్రకటనలు, తీర్మాణాల ఆమోదం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే, కొన్ని తీర్మానాల పట్ల కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉండడంతో, చింతన్ వేదికగా ఎం చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఈ శిబిర్‌కు ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. కానీ, అమె రావట్లేదని తెలుస్తోంది.