Huzurabad Congress Candidate: రండిబాబు రండి.. ఉద్యోగం సద్యోగం లేదని చింతించకండి.. మీలాంటి వారికోసమే…అద్భుత అవకాశం.. 125ఏళ్ల చరిత్రున్న కంపెనీ.. ప్రతి స్టేట్‌లో హెడ్డాఫీసులున్నాయి.. ప్రతి డిస్ట్రిక్ట్‌లో బ్రాంచ్‌లున్నాయి.. ప్రతి ఊరిలో కంపెనీ లోగో.. వేలాడతానే ఉంటది.. ప్రతి గడపకూ తెలుసు..ప్రతి మనిషికీ తెలుసు.. కంపెనీ ఎత్తిపోతది అన్న భయం.. అస్సలు అక్కర్లే.. ఇది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. అనుహ్య పరిస్థితుల్లో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీరు. అభ్యర్థుల వేటలో భాగంగా ఎవరైనా పోటీ చేసేందుకు డోర్లు బార్ల తెరిచిన పరిస్థితి. ఎవరైనా అఫ్లై చేసుకోవచ్చని గాంధీ భవన్ సాక్షిగా ప్రకటన వెలువడింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎంపిక దగ్గరే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిని ఎంపిక చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే.. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం కాస్త నెమ్మదిగానే ముందుకు సాగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో తొందరగా అవసరం లేదని భావిస్తుందో లేక నిజంగానే ఇందుకోసం సమయం పడుతుందో తెలియదు కానీ.. ఇంకా హుజూరాబాద్‌లో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఆ పార్టీలో క్లారిటీ రావడం లేదు. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో ముఖ్యనేతల సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై కూలంకషంగా చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న దామోదర రాజనర్సింహ.. దీనిపై మాణిక్యం ఠాగూర్‌కు వివరించారు. మరోవైపు అభ్యర్థి కోసం ఏకంగా ఓ కౌంటరే తెరిచారు. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10గంటల నుంచి సెప్టెంబర్ 5ఆదివారం సాయంత్రం 5గంటల్లోపే దరఖాస్తులు సమర్పించుకోవాల్సిందంటూ వెల్లడించింది. అలా అప్లై చేసినప్పుడు దాంతో పాటు రూ.5వేల డీడీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
ఆఫీసు… నాంపల్లి స్టేషన్, గాంధీభవనం
పోస్టు.. హుజురాబాద్ అభ్యర్ధి
దరఖాస్తు ప్రారంభతేదీ ..సెప్టెంబర్ 1, ముగింపు తేది సెప్టెంబర్ 5
ఫీజు..5వేలు ..తిరిగొస్తాయని ఆశలు అస్సలు పెట్టుకోనక్కర్లే
ఇంటర్వ్యూ తేది సెప్టెంబర్ 6 నుంచి , తర్వాత మీ ఖర్మ కాలితే ఉద్యోగం మీకే. మీ అదృష్టం బాగుంటే..5వేలు మిగులే. ఇంకెందుకాలస్యం…దరఖాస్తు చేసుకోండి…గాంధీభవనం పెద్దోళ్ల పరువు నిలపండి…ముఖ్యంగా ఆ యువరాజు పరువును హుజురాబాద్ నడిబజార్లో నిలువునా నిలబడే అవకాశం పొందండి…
ఇందడి..సెంచరీ దాటిన కాంగ్రెస్ పరిస్థితి. కొన్నిరోజులు పోతే టీవీల్లో ఇలా యాడ్‌లొచ్చినా నో ఆశ్చర్యమ్స్..అలా ఉందట పరిస్థితి. ఓపారి ఇలా చూడండి..మన తెలంగాణ కాంగ్రెస్ పెద్ధోళ్లంత ఎంతబాగా కూర్చున్నారో..వీళ్ల కసరత్తంతా హుజురాబాద్ అభ్యర్ధి ఎవరన్నాదనిపైనే అట. ఇట్నే ఉందట..గాంధీభవనం దగ్గర అభ్యర్ధి ఎంపిక. ఈ పెద్దోళ్లంతా ఇలా మీటింగ్ పెట్టి.. సముదాయించాల్సిన నేతలే కరువయ్యారని పార్టీ నేతల గుసగుసలాడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో గాంధీభవన్‌లోని ముచ్చట గురించి తెగ సెటైర్లు పేలుతున్నాయి. హుజూరాబాద్ అభ్యర్ధికోసం కాంగ్రెస్ వేట మొదలుపెట్టింది. ఈవేటలో కాంగ్రెస్ గాలానికి చిక్కిన చేపలన్నీ చిక్కినట్టే చిక్కి టక్కున జారుకుంటున్నాయట.. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి జంప్ కావడంతో…అక్కడి అభ్యర్ధి కోసం వేట ముమ్మరం చేసింది. ముందుగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను నిలబడాల్సిందే అన్నారట. పాపం ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయే.. ఇప్పుడు కూడా అలాంటి పరాభవమే ఎదురైతే.. రెండున్నరేళ్లలో మూడుసార్లు ఓడిన రికార్డు పొన్నంసార్ పేరుమీద ఉంటదన్న భయంతో.. వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
ఇక, స్థానికంగా , బీసీ నాయకుడ్ని పెడితే బెటర్ అన్న ఆలోచన కాంగ్రెస్ అధినాయకత్వం చేస్తోంది. ఇలా జల్లెడ పట్టగా పట్టగా.. ఐదుగురి పేర్లు బయటపడ్డాయట. అందులో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయినా అక్కడి స్థానిక నేతలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతో చర్చించాలని డిసైడ్ అయ్యారు. ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నిక సమన్వయం బాధ్యతలను భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలకు అప్పగించారు. ఓవరాల్‌గా కాంగ్రెస్ మాత్రం అభ్యర్ధి కోసం తెగ కష్టపడుతున్నట్టే కనిపిస్తోంది. అలాగని హుజురాబాద్‌లో హస్తం పార్టీ మరీ తీసికట్టు ఏంకాదండోయ్..కేడర్ బలంగానే ఉంది. దాదాపు ఓ 40వేలకు పైచిలుకు ఓట్లు హస్తంకున్నాయి..మరి ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో కానీ..గట్టిగా పోరాడితే..గట్టిగానే పోటీఇచ్చేపరిస్థితి. చూద్దాం..ధైర్యంగా నిలబడే కాంగ్రెస్ యోధుడెవరో…