గోసంరక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో నాలుగు గోశాలల నిర్మాణానికి శ్రీకారం.. ఎక్కడెక్కడంటే!

తెలంగాణలో గోవుల సంరక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందు కోసం ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి.. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

గోసంరక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో నాలుగు గోశాలల నిర్మాణానికి శ్రీకారం.. ఎక్కడెక్కడంటే!
Cm Revanth Reddy

Updated on: Jun 17, 2025 | 11:42 PM

రాష్ట్రంలోని గోవుల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గోవుల సంరక్షణపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారు. కానీ వాటికి సరైన నివాస స్థలాలు, వసతులు లేని కారణంగా గోవులు తరచూ మృత్యువాత పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ కోసం సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని తెలిపారు.

ఈ మేరకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావులను నియమించారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న గోసంరక్షణ విధానాలపై అధ్యయనం చేసి, మన రాష్ట్రానికి అనువైన సూచనలతో నివేదిక సమర్పించాలని తెలిపారు.

గోవుల‌ సంర‌క్షణే ధ్యేయంగా రాష్ట్రంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడిన ఆధునిక గోశాలలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రముఖ దేవ‌స్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర శివారులోని ఎనికేపల్లి, ప‌శు సంవ‌ర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన ప్రాంగణాల్లో ఈ గోశాలలు నిర్మించాలన్నారు. ముఖ్యంగా వేములవాడ సమీపంలో వంద ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గోసంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడబోదని సీఎం తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..