ఢిల్లీలో పర్యటనలో బిజీ బిజీగా ఉన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడి వసంత విహార్‌లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ భవనాన్ని సందర్శించారు. దాదాపు గంట సేపు ఆయన భవన ప్రాంగణంలో గడిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై ఇంజినీర్లతో మాట్లాడారు. భవనం ప్లాన్‌ను పరిశీలించారు. భవనం పైకి ఎక్కి పనులు జరుగుతున్న తీరుతెన్నులను చూశారు. వాస్తుకు అనుగుణంగా కొన్ని మార్పులను సూచించారు సీఎం. ఏడాది లోపు పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. సీఎం వెంట ఈ పర్యటనలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, దామోదర్ రావు, గాయత్రి రవి కూడా ఉన్నారు.
కాగా, టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భవనంలో ఇప్పటికే రెండంతస్తులపై కప్పుపడింది. 2021 సెప్టెంబర్ ఒకటిన ఈ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2020లోనే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న వసంత్ విహార్‌లో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్‌కు 1200 గజాల స్థలాన్ని కేటాయించింది. దక్షిణాది నుంచి DMKకు మాత్రమే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది. నిర్మాణంలో ఈ భనవం పూర్తైతే ఆ ఘనత సాధించిన మరో పార్టీగా గులాబీ పార్టీ మారనుంది.
వాస్తవానికి ఈ ఏడాది దసరా నాటికే నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కాని పనుల్లో జాప్యం జరుగుతోంది. 2024 ఎన్నికల్లోపు ఈ భవనాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రస్తుతానికి ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులోని అద్దె భవనం నుంచి బీఆర్ఎస్ కార్యకలాపాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ అద్దె భవనాన్ని మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ పరిశీలించి కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..