
Telangana: తెలంగాణలో మరో మెగా ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎట్టకేలకు పూర్తి కావడంతో.. రేపే సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయబోతున్నారు. మరి ఈ ప్రాజెక్టు విశేషాలేంటి? దీనివల్ల ఎన్ని ఎకరాలకు నీరు అందబోతోంది? కీలక వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆదివారం తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. ఈ ఒక్క ప్రాజెక్టుతో.. 12.3లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. కృష్ణానదీ జలాలను పాతాళం నుంచి ఆకాశానికి అన్నట్లుగా ఎత్తిపోయబోతోంది ఈ ప్రాజెక్టు. నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్ వద్ద ఈ నెల 16న సీఎం కేసీఆర్ బటన్ నొక్కి బహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోయనున్నారు.
నిజానికి పాలమూరు పక్కనే కృష్ణ పరుగులు తీస్తున్నా.. చుక్కనీరు జిల్లాలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో జిల్లాలో ఎప్పుడూ కరువు కాటకాలే విలయతాండవం చేసేవి. ఇప్పుడు పాలమూరే కాదు.. రంగారెడ్డి జిల్లానీ సస్యశ్యామలం చేయబోతోంది ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఉమ్మడి మహబూబ్‌నగర్ తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35 లక్షల మంది నివసించే ఈ జిల్లాకు దేశంలోనే ఓ ప్రతేక గుర్తింపు ఉంది. కానీ సాగు నీటి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయింది. పాలమూరు జిల్లా మొత్తం విస్తీర్ణం 43.73 లక్షల ఎకరాలు ఉంటే అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు. జూరాల ప్రాజెక్టుతోపాటు.. చెరువుల ద్వారా రెండులక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో దాదాపు పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఇరిగేషన్ రంగంలో కాళేశ్వరంతో పోటీపడే స్థాయి మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుది. నభూతో అన్న విధంగా పిఆర్ఆర్ రూపొందింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. అంజనాగిరి, ఏదుల వీరంజనేయ, వట్టేం వెంకాటాద్రి, కరివెన కురుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయిర్లను నిర్మించారు. పిఆర్ఆర్ ప్రాజెక్టులో మొత్తం 34 మహా బాహుబలి మోటార్లు ఉన్నాయి. వీటి ద్వారా కృష్ణా నీటిని ఎత్తి రిజర్వాయర్లకు తరలించనున్నారు. మొత్తం 120 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ ద్వారా వచ్చే కృష్ణా జలాలతో వివిధ రిజర్వాయర్లను నింపుతారు. నార్లపూర్‌లో పది బాహుబలి కా బాప్ లాంటి మోటార్లు అమర్చారు. ఒక్కో మోటార్ బరువు 550 టన్నులు ఉంటుంది. వీటి కెపాసిటీ 145 మెగావాట్లు. మోటార్ స్లేటర్ బరువు 200 టన్నులు.. ఒక్కో పంపు గేటు బరువు 40 టన్నులు. ఇలాంటి మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కాబోతోంది.
16న నార్లపూర్ పంప్‌హౌస్ దగ్గర సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కంట్రోల్ స్టేషన్ మోటార్‌కు స్విచాన్ చేస్తారు. కలశాలతో ప్రతీ ఊరికి కృష్ణమ్మను తీసుకెళ్లనున్నారు. ఈ కృష్ణా జలాలతో దేవాలయాల్లో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. 16న నార్లపూర్ పంప్‌హౌస్ ప్రారంభం తర్వాత రిజర్వాయర్ను పరిశీలిస్తారు సీఎం కేసీఆర్. అనంతరం భారీ బహిరంగసభలో ప్రసంగగిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..