Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ.. ప్రధాన ఎజెండా ఆ ఒక్కటే..!
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గం రేపు మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్(Pragathi Bhavan)లో సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ధాన్యం కొనగోలుపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి తీరుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్వర్యంలో ఇవాళ దిల్లీలో దీక్ష చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా.. రాకపోయినా ఆయా విషయాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్ బయల్దేరనున్నారు. పది రోజుల పాటు కేసీఆర్ దిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, దేశ రాజధాని ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ కేంద్రంపై సమర శంఖం పూరించారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు చేసిన తీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కొంటారో లేదో 24 గంటల్లో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్‌కు డెడ్‌లైన్ విధించారు సీఎం కేసీఆర్. లేదంటే ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. డెడ్‌లైన్ తరువాత తమ కార్యాచరణ చూపిస్తామని హెచ్చరించారు కేసీఆర్. రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పారు. రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని.. కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు. తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ.. ధాన్యం వద్దా అని బీజేపీని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.