CM KCR Warning: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. బీజేపీ నాయకత్వానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

|

Feb 10, 2021 | 6:00 PM

KCR Warning: హాలియా వేదికగా జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన

CM KCR Warning: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. బీజేపీ నాయకత్వానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow us on

KCR Warning: హాలియా వేదికగా జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. విపక్షాలపై పరోక్షాంగానే కన్నెర్ర జేశారు. తెలంగాణ అన్న పదాన్ని పలికే అర్హత కూడా వారికి లేదంటూ ధ్వజమెత్తారు. బీజేపీ నాయకత్వం ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణను ముక్కలు చేసి ఇతర రాష్ట్రాల్లో కలిపిన వాళ్లు ఎవరు? అంటూ బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో ఏం చేశారంటూ నిలదీశారు. కొత్త బిక్షగాడు పొద్దు ఎరగడు అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తాము తలుచుకుంటే బీజేపీ నేతలు దుమ్ము దుమ్ము అయిపోతారంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదని అన్నారు. టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ అని, వీపు చూపించే పార్టీ కాదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతలకూ వార్నింగ్..
ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలపైనా సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పొలం బాట, పోరు బాట అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. ఉద్యమ సమయంలో ఏం చేశారని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణాలను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడాన్ని తప్పుపట్టిన ఆయన.. నాగార్జునసాగర్‌ను కూడా కమీషన్ల కోసమే కట్టారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధులు కాదని, రాబంధులు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉన్నప్పుడు నీళ్లు ఆపితే ఎవరూ నోరెత్తలేదని నాటి ఘటనను గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. అన్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ నేతలు కనీసం మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ నేతలది దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అని విమర్శించారు. అలాంటి రాజ్యం కోసమే కాంగ్రెస్ నేతలు పొలం బాట పట్టారని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘రాక్షసులతోనే కొట్లాడాం.. మీరో లెక్కా..’ అని వ్యాఖ్యానినంచారు.

సంక్షేమ పథకాల అమలుపై కేసీఆర్ కామెంట్స్..
తనది అవినీతి రహిత ప్రభుత్వం అన్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ‘కల్యాణ లక్ష్మి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? కేసీఆర్ కిట్ ఎక్కడైనా ఉందా?’ అని ప్రశ్నించారు. త్వరలోనే అర్హులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

అలా చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోం..
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి నల్గొండ జిల్లా కాల్లు కడుగుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని స్పష్టం చేశారు. నెల్లికల్‌, జాన్‌పహాడ్‌, ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌, రూ. 2500 కోట్లు లిఫ్టు స్కీంలకు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. ఏడాదిన్నర లోపు వీటిని పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు. ఎడమ కాల్వ కింద ఏకరం కూడా ఎండిపోనివ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వీర్లపాలెం లిఫ్టు, తోపుచర్ల లిఫ్టులు మంజూరు చేస్తామని, ఆ లిఫ్టులను పూర్తి చేసి నీటిని అందిస్తామన్నారు. ఇక జిల్లాలో పలు ప్రాంతాల్లో భూసమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించి శాశ్వత పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. భూసమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతోందని పేర్కొన్నారు.

CM KCR Speech Live:

Also read:

జర్నలిస్ట్ ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసు, తీర్పును ఈ నెల 17 కి వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు

Breaking News: నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.. రేపు జీవో విడుదల చేస్తామంటూ..