CM KCR: పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ.. ఆడవి అంచున భూముల కేటాయింపుః సీఎం కేసీఆర్
CM KCR Review on Podu Bhumulu: పోడు భూముల అంశంపై శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
CM KCR on Podu Bhumulu: రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల అంశంపై శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పోడు భూముల రక్షణకు ఈ నెల మూడో వారంలో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత.. ఒక్క గజం అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు. ఆటవీ భూముల దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్యాక్రాంతమవుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా వివరించాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలను తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున భూమిని కేటాయిస్తామన్నారు. తరలించిన భూమికి సంబంధించి ప్రభుత్వం ద్వారా ధ్రువపత్రాలు ఇచ్చి, వ్యవసాయానికి అవసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించడంతో పాటు రైతుబంధు, బీమా పథకాలు వర్తింపజేస్తామన్నారు. మానవ మనుగడకు అడవుల సంరక్షణ కీలకమన్నారు సీఎం. ‘మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. బయో డైవర్సిటీ కూడా పెరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరిత నిధికి విశేష స్పందన వస్తున్నది. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ వహించాలి. సమర్థవంతమైన అధికారులను నియమించాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న సీఎం. అసెంబ్లీలో ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించండి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. ‘అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటుంది. వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటది. వారు అడవులను ప్రాణంగా చూసుకుంటారు. అడవులకు హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనెతెట్టె, బంక, పొయిల కట్టెలు తదితర అటవీ ఉత్పత్తుల కోసం మాత్రమే వారు అడవులను ఉపయోగించుకుంటారు. ప్రభుత్వం వారి జీవన హక్కును కాపాడుతుంది. సమస్య అంతా కూడా బయటి నుంచి పోయి అటవీ భూములను ఆక్రమించి, అటవీ సంపదను నరికి, దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచే అటవీభూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తుంది.
ఆ తర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారులదే బాధ్యత. ‘నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్ సైడ్ ఇస్ ఓన్లీ ఫారెస్ట్’ (అడవి తప్ప, లోపల ఎవరూ ఉండడానికి వీల్లేదు)’ అని సీఎం స్పష్టం చేశారు. అక్టోబర్ మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించాలని, దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి వారికి తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎమ్మెల్యేల సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు అటవీ భూముల రక్షణలో కీలకంగా పనిచేయాలన్నారు. నవంబర్ నెల నుంచి అటవీ భూముల సర్వేను ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు.
కోఆర్డినేట్స్ ద్వారా ప్రభుత్వ అటవీభూముల సరిహద్దులను గుర్తించాలన్నారు. అవసరమైన మేరకు కందకాలు తొవ్వడం, ఫెన్సింగ్ తదితర పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కావాల్సిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ అందిస్తామని తెలిపారు. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, ఆర్ఎం డోబ్రియాల్, స్వర్గం శ్రీనివాస్, హైదరాబాద్ సర్కిల్ సీసీఎఫ్ అక్బర్, సీసీఎఫ్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ రాజా రావు, టీఎస్ టీఎస్ ఎండీ వేంకటేశ్వర్ రావు, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.