CM KCR: వర్షాల వెనుక విదేశీ కుట్ర.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

|

Jul 17, 2022 | 1:18 PM

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గోదావరి పరిసరాలను పరిశీలించారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల..

CM KCR: వర్షాల వెనుక విదేశీ కుట్ర.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
Telangana Cm Kcr
Follow us on

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గోదావరి పరిసరాలను పరిశీలించారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఏరియల్‌ సర్వే ఉండగా, భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అది రద్దయ్యింది. ఇక పరిసరాలను పరిశీలించిన తర్వాత గోదారమ్మకు శాంతి పూజ నిర్వహించారు. అలాగే భద్రాచలం కరకట్టను పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు ఉన్నాయని, ఎత్తైన ప్రదేశాల్లో కాలనీలు నిర్మించాలని కలెక్టర్‌కు ఆదేశించారు. వరద వల్ల ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా అన్ని జిల్లాల అధికారులు కలిసి పని చేశారన్నారు. గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం కావాలి.
భగవంతుని దయవల్లే కడెం ప్రాజెక్ట్‌ నిలబడిందని, క్లౌడ్‌ బరెస్ట్‌లకు కుట్ర జరిగినట్లు అనుమానాలున్నాయని, దానిపై విచారణ చేపడతామన్నారు. ఈ వరదలకు ఇతర దేశాల కుట్ర ఉందని అంటున్నారని, కావాలనే క్లౌడ్‌ బరస్ట్‌ చేశారంటున్నారని, గతంలో కశ్మీర్‌, లేహ్‌ దగ్గర ఇలాంటి ఘటనలు జరిగినట్లు వార్తలొస్తున్నాయన్నారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం మునగడం బాధాకరమన్నారు. బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

బాధితులకు రూ.10వేల సాయం..

వరద బాధితులకు తక్షణంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాగా, గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం అవుతోంది. ముంపు గ్రామాలన్ని జలదిగ్బంధంలో ఉండిపోయాయి. భారీ వరద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ఊహించనంత వరద కడెం ప్రాజెక్టుకు వచ్చిందని, వర్షాలు తగ్గిపోయాయని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దని, ఈనెల 29 వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడెం ప్రాజెక్టు వరద ఏ ఒక్క రోజూ రెండున్నర లక్షల క్యూసెక్కులు దాటలేదని, కడెం ప్రాజెక్టు అత్యధిక నీటి విడుదల సుమారు మూడు లక్షల క్యూసెక్కులు అని అన్నారు.