Telangana Integration Day: కేంద్రాన్ని, బీజేపీని మరోసారి టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. మతతత్వ శక్తులు అంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయని, విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని విమర్శించారు. సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆనాటి ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు తెలంగాణ చరిత్రను మలినం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌తో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. కొందరు దుర్మార్గులు విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని, సామాజిక సంబంధాల నడుమ ముళ్ల కంపలు నాటుతున్నాయని ఫైర్ అయ్యారు. చరిత్రను వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే.. నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. రెండు చేతులు జోడించి మరీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాన్న సీఎం కేసీఆర్.. ఈ నేల ఎన్నటికీ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప.. అశాంతి, అలజడులతో అట్టుడికి పోకూడదని ఆకాంక్షించారు. గతంలో కొద్దిపాటు ఏమరపాటు వల్ల 50 ఏళ్లు గోసపడ్డామని, తెలంగాణ తిరిగి మరో కల్లోలంలోకి జారిపోకూడదని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.