కోట్లలో ఆర్థిక మోసానికి పాల్పడిన నిందితుడు పోలీసుల కంటపడకుండా ఏకంగా 28 ఏళ్లు తప్పించుకు తిరిగాడు. ఎట్టకేలకు పాపం పండటంతో తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కిపంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలం నందిగోన్ గ్రామ పరిధిలో 1995లో వానిసింగ్ కంపెనీ పేరిట ఓ స్టీల్ కంపెనీని స్థాపించారు. కంపెనీలో షేర్లపేరిట స్థానికుల నుంచి మొత్తం 4.3 కోట్ల రూపాయలు కంపెనీ నిర్వాహకులు వసూలు చేశారు. ఇలా సేకరించిన మొత్తం సొమ్ములో దాదాపు రూ.4 కోట్లను 1995లో ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లో దాదర్ బ్రాంచ్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వీఎస్ క్షీర్‌సాగర్ (78) కొట్టేశాడు. కంపెనీ దివాళా తీయడంతో ఎంతోమంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో వీఎస్ క్షీర్‌సాగర్‌పై మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ పోలీస్ స్టేషన్‌లో 1995లోనే కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సీఐడీ అధికారులు దర్యాప్తులో నిందితుడిపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును దాదాపు 28 ఏళ్ల తర్వాత అమలు చేస్తూ నిందితుడిని ఇండోర్ పట్టణంలో అరెస్టు చేశారు. ఈమేరకు అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ బుధవారం మీడియాకు వివరించారు. ఈ కేసును ఛేదిండంతో కీలకంగా వ్యవహరించిన అధికారులను డీజీ మహేశ్ భగవత్ అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.