
తెలంగాణలో అమలవుతున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల వ్యవస్థలో ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు నగదు చెల్లింపుల విధానాన్ని క్రమంగా నిలిపివేసి, నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు చేయూత పథకం ద్వారా ప్రతి నెలా ఆర్థిక సహాయం పొందుతున్నారు. అయితే ఇప్పటికీ సంఖ్యలో లబ్ధిదారులకు నగదు రూపంలోనే పెన్షన్లు అందుతున్నాయి. గ్రామ స్థాయిలో అధికారులు, పోస్టల్ వ్యవస్థ ద్వారా ఈ పంపిణీ జరుగుతోంది. ఈ ప్రక్రియలో ఆలస్యాలు, అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం వంటి అంశాలపై ప్రభుత్వం వద్దకు అనేక ఫిర్యాదులు చేరినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ కోసం పోస్టాఫీసులు లేదా పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు, రికార్డుల లోపాలు కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ మోడ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానం కింద నగదు రూపంలో పెన్షన్ పొందుతున్న ప్రతి లబ్ధిదారుడికి బ్యాంకింగ్ సౌకర్యం కల్పించనున్నారు. అవసరమైన వారికి పోస్టల్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకు ఖాతాలు తెరవడం, వాటిని ఆధార్‌తో అనుసంధానం చేయడం వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
ఇకపై ప్రభుత్వం విడుదల చేసే పెన్షన్ మొత్తం నేరుగా లబ్ధిదారుడి వ్యక్తిగత ఖాతాలో జమ అవుతుంది. దీంతో ఎవరిపైనా ఆధారపడకుండా, వారికి అనుకూలమైన సమయంలో ఏటీఎంలు, బ్యాంకులు లేదా ఇతర డిజిటల్ బ్యాంకింగ్ సేవల ద్వారా సొమ్మును పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు కొత్త పెన్షన్‌ల మంజూరులో కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకురానుంది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, సామాజిక-ఆర్థిక సర్వే వివరాలను అనుసంధానం చేసి అర్హుల జాబితాను మరింత కచ్చితంగా రూపొందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల వివరాల ధృవీకరణ కోసం ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హుల గుర్తింపు పూర్తయిన తర్వాత కొత్త వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయితే రాబోయే నెలల్లోనే పెన్షన్ సొమ్ము నేరుగా ఖాతాల్లో జమయ్యే విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ నిర్ణయంతో పెన్షన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు, అవినీతి అవకాశాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు చేరడం, మధ్యవర్తుల జోక్యం తగ్గడం, ప్రభుత్వ నిధుల వినియోగంపై మెరుగైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణలో సామాజిక భద్రతా పథకాల అమలులో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి