Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ ఖాళీకి మోక్షమెప్పుడు.. ఈటల స్థానం కోసం నేతల మధ్య పోటీ!

|

Jan 23, 2022 | 5:58 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో ఏర్పడ్డ ఖాళీకి మోక్షం ఎప్పుడు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో రీప్లేస్ ఉన్నట్టా లేనట్టా.. ఉంటే ఎప్పుడు.. ఇస్తే అవకాశం ఎవ్వరికీ..

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ ఖాళీకి మోక్షమెప్పుడు.. ఈటల స్థానం కోసం నేతల మధ్య పోటీ!
Cm Kcr
Follow us on

Telangana Cabinet Reshuffle: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో ఏర్పడ్డ ఖాళీకి మోక్షం ఎప్పుడు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో రీప్లేస్ ఉన్నట్టా లేనట్టా.. ఉంటే ఎప్పుడు.. ఇస్తే అవకాశం ఎవ్వరికీ.. టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మంత్రి మండలిలో మార్పులు చేర్పులు ఉంటాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న పోస్ట్‌పై ఇప్పుడు ఉభయ సభల ప్రజాప్రతినిధుల్లో తెగ ఆసక్తి రేపుతోంది.

తెలంగాణలో ఈటల రాజేందర్ తొలగింపు తరువాత చాలా కాలం ఆరోగ్య శాఖ పదవీ ఖాళీగానే ఉన్నా.. ఈ మధ్య ఆర్థిక శాఖ మంత్రి హరిష్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్ కేసీఆర్. అవకాశం ఉన్నా.. కాని భర్తీ మాత్రం పూర్తి చెయ్యడం లేదు… దీంతో ఇప్పుడు అందరి చూపు ఆ పదవిపైనే పడింది. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆరోగ్య శాఖ పర్యవేక్షణపై ఏలోటు లేకున్నా.. ఒక పదవి భర్తీ అవకాశం ఉంది. కాబట్టి గులాబీ బాస్ ఎప్పుడు భర్తీ పై నిర్ణయం తీసుకున్నా ఆ పదవి దక్కయించుకునేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.

కేవలం నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టిన కేసీఆర్.. కేబినెట్ పై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు.. కానీ, తాజాగా ఎమ్మెల్సీల భర్తీ సమయంలో కేసీఆర్ చూపించిన ఇక్వెషన్స్ చూస్తే మాత్రం పక్కా ఈసారి ఎమ్మెల్సీల్లో ఒకరికి స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. ముఖ్య నేత ఒకరికి ఈటల రాజేందర్ స్థానం దక్కబోతున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి అటు ఎంపీ పదవిలో ఉన్న బండ ప్రకాష్‌ను ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ చేయడంతో ఇక మంత్రి పదవి ఆయన్నే వరిస్తుంది అనేది రాజకీయ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. కానీ, అటు ఎమ్మెల్సీగా మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఇద్దరిలో ఒకరికి కేబినేట్ లో బెర్త్ పక్కా అని సమాచారం.

ఉన్న ఒక్క పదవి భర్తీ తో కేసీఆర్ ఉరుకుంటారా లేదా కేబినెట్ ప్రక్షాళన చేస్తారా అనే ఆలోచనలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో మొదలయింది .అలా కేబినెట్ బెర్త్ పూర్తి చేస్తే ఉన్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదనే టాక్ కూడా వినిపిస్తోంది. అలా జరిగితే వచ్చే అవకాశం కోసం జిల్లాల వారిగా సీనియర్ ఎమ్మెల్యేలు లైన్ లో ఉన్నారు. అయితే, ఇలా ఎవరికి వారు లెక్కలు వేస్తుంటే ఇంతకు కేసీఆర్ భర్తీ చేస్తారా లేదా ఇలాగే ఈ పీరియడ్‌ని పూర్తి చేస్తారా అనే అనుమనలు కూడా లేకపోలేదు. మార్చి నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేస్తే వచ్చే నెలలోనే చేస్తారనే టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది.

—– శ్రీధర్ ప్రసాద్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్ 

Read Also….  Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్..!