తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేబినేట్ ఆమోదించనుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రవేశపెట్టే తీర్మానం ప్రతిపై సాయంత్రం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నిర్వహణపైనా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్పీఆర్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై చేసే ప్రకటన గురించి కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశ ముందని సమాచారం. కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ సమావేశాల్లోనే తీసుకొ స్తామని సీఎం ఇప్పటికే ప్రకటన చేశారు. ముసాయిదా రెవెన్యూ చట్టానికి తుదిరూపునిచ్చి శాసన సభలో ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను సైతం కేబినెట్ సమా వేశంలో చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.