AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Cabinet Expansion: రేవంత్‌ ఒకలా.. మీనాక్షి మరోలా..! కన్‌ఫ్యూజన్‌లో కాంగ్రెస్‌ నేతలు

ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. తీరా చూస్తే ఏదీ లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అసలు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్‌ కామెంట్స్‌తో మరోసారి కేబినెట్‌ అంశం తెరపైకొచ్చింది.

Telangana Cabinet Expansion: రేవంత్‌ ఒకలా.. మీనాక్షి మరోలా..! కన్‌ఫ్యూజన్‌లో కాంగ్రెస్‌ నేతలు
Meenakshi Natarajan Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 24, 2025 | 9:23 AM

Share

ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. తీరా చూస్తే ఏదీ లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అసలు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్‌ కామెంట్స్‌తో మరోసారి కేబినెట్‌ అంశం తెరపైకొచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఎవరి పరిధిలో ఉంటుందన్న టాపిక్‌పై తెలంగాణలో హాట్‌హాట్‌ డిబేట్స్‌ నడుస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు.. అంతకంతకూ పెరిగిపోయిన ఆశావహులు.. కాలం గడిచిపోతున్నా పదవీ కాంక్ష నెరవేరని నాయకుల ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇప్పట్లో కేబినెట్‌ విస్తరణ కష్టమేనన్న సంకేతాలతో కొన్నాళ్లుగా నేతలంతా సైలెంట్‌ అయిపోయారు. అయితే లేటెస్ట్‌గా మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. కేబినెట్‌ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలో ఉందంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

ఈ కామెంట్సే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. మొన్నటిదాకా కేబినెట్‌ విస్తరణ అంశం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని చెబుతూ వచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులనే మంత్రిపదవి వరిస్తుందని.. ఆ నేతలు ఎవరనేది మాత్రం నిర్ణయించేది అధిష్టానమే పదేపదే చెప్పారు రేవంత్‌రెడ్డి. దీంతో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం ఎంతోమంది సీనియర్లు అధిష్టానం పెద్దలను కలవడం, లేఖలు రాయడం జరిగింది.

సీనియర్‌ నేత జానారెడ్డి కూడా హైకమాండ్‌కు లెటర్‌ రాశారు. రంగారెడ్డి జిల్లాకు ఛాన్సివ్వాలని ఖర్గేకు, కేసీ వేణుగోపాల్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే రాజీనామా చేస్తానంటూ పార్టీ పెద్దలకే అల్టిమేటం ఇచ్చారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లానుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారన్న ప్రచారం జరిగింది. ఇటు నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్‌ జరిపినట్లు జోరుగా ప్రచారం నడిచింది. ఇలా ఒక్కరేంటి… మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న తపనతో ఎందరో నేతలు హస్తినబాట పట్టారు.మరికొందరు విజ్జప్తి లేఖలు ఢిల్లీకి పంపారు.

మొత్తంగా… కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్‌ ఒకలా.. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ మరోలా మాట్లాడటంతో నేతలంతా కన్‌ఫ్యూజన్‌లో పడ్డట్లు తెలుస్తోంది. మరీ ఈ కేబినెట్‌ విస్తరణ కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ రావాలంటే కాస్త ఆగాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..