Jonnalagadda Praveen: అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కామ్‌స్కోప్ సంస్థకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జొన్నల గడ్డ ప్రవీణ్ (45) సీఐఓ (చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్)గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. సీఐఓగా నియామకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తన శ్రమకు తగిన గుర్తింపు లభించినట్లు భావిస్తున్నానని అన్నారు. అక్కడ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు సీఐవో స్థాయికి ఎదిగారు. ఈ ఉత్సాహంతో సాంకేతిక ఆవిష్కరణలో మరిన్ని అద్భుతాల కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
మిర్యాలగూడ మండలం గూడూరుకు చెందిన జొన్నలగడ్డ రంగారెడ్డి, విమలాదేవి దంపతుల సంతానం ప్రవీణ్. స్థానిక పాఠశాలలోనే ప్రవీణ్ తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం ఎయిడెడ్ కళాశాలలో చేరి బీఎస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి 2001లో ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. దాదాపు 12 సంవత్సరాల కిందట కామ్ స్కోప్‌లో చేరిన ప్రవీణ్.. ఆ సంస్థలో డైరెక్టర్, వైస్ ప్రసిడెంట్, సీనియర్ వైస్ ప్రసిడెంట్ తదితర హోదాల్లో పని చేశారు. కామ్‌స్కోప్‌లో 50 మంది సాంకేతిక నిపుణుల్లో ముఖ్యుడిగా ఉండటంతో సీఐఓగా అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని 250 ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కామ్ స్కోప్ సంస్థలో ఉన్నత స్థానానికి ఎదిగారు.
ఇవీ చదవండి: Indian Techie: అమెరికాలో విషాదం.. భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. అనాథగా మారిన నాలుగేళ్ల చిన్నారి
Lady Khiladi: మాయమాటలతో వలలో వేసుకుని డబ్బులు గుంజుతున్న ఖిలాడి లేడీ.. లబోదిబోమంటున్న బాధితులు..