తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల లిస్ట్ దాదాపుగా ఫైనల్ అయింది. ఇవాళ ఏ క్షణమైనా అభ్యర్ధుల ప్రకటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా కసరత్తు చేసిన బీజేపీ అగ్రనేతలు లిస్ట్ రెడీ చేశారు. నిన్ననే ఆ జాబితాను ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఫస్ట్ లిస్ట్‌లో సీటు దక్కించుకున్న అభ్యర్ధుల్లో కొంత మందికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది.
శుక్రవారం అర్థరాత్రి వరకు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సమావేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ 3వ జాబితా, మధ్యప్రదేశ్ 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. కానీ తెలంగాణ తొలి జాబితాను సిద్ధం చేసినప్పటికీ విడుదల మాత్రం చేయలేదు. ఈ జాబితాను ఆదివారం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పెద్ద పండుగైన దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంగా ఈ జాబితాను ఆ రోజు ప్రకటించాలని నాయకత్వం భావించినట్టు తెలిసింది. అందుకే శనివారం విడుదల చేయకుండా ఒక రోజు ఆలస్యం చేసినట్టు సమాచారం.
వరుస భేటీలు.. వడపోతలు.. అంతకుమించి సుదీర్ఘ కసరత్తు.. తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అభ్యర్ధుల బలాలు, బ్యాగ్రౌండ్, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంపికలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్ సహా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
బీసీ కార్డ్‌తో ఎన్నికలకు వెళ్లాలని.. ఇందులో భాగంగా బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది టీబీజేపీ. ఎన్నికల్లో బీసీ నినాదం తమకు తిరుగులేని అస్త్రంగా మారుతుందని లెక్కలేసుకుంటోంది. మరోవైపు రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటనకి ముందే సస్పెన్షన్ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..