Bandi Sanjay: రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైంది.. టీఆర్ఎస్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదుః బండి సంజయ్

Bandi Sanjay fire on TRS Government: తనను జైలుకు పంపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హట్సాప్‌ అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కుమార్.

Bandi Sanjay: రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైంది.. టీఆర్ఎస్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదుః బండి సంజయ్
Bandi Sanjay

Updated on: Jan 05, 2022 | 9:17 PM

Bandi Sanjay fire on TRS Government: తనను జైలుకు పంపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హట్సాప్‌ అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కుమార్. ఈ ఘటన ద్వారా తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ నిజస్వరూపం తెలిసిందన్నారు. హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదల అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైలు మాకు కొత్త కాదన్నారు. ఎన్నిసార్లు అయినా పంపండని ఆయన సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరన్నారని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పోలీసులు కార్యకర్తలను ఇష్టమెచ్చినట్లు కొట్టారన్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైందన్న బండి సంజయ్.. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317ను ప్రభుత్వం వెంటనే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా బీజేపీ ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మరోవైపు, బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నిరసనలు ఊపందుకోనున్నాయి. జీవో 317ను పున:సమీక్షించాలనే డిమాండ్‌తో ఈ నెల 10వ తేదీన తెలంగాణ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్ విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసింది. జీవో 317 కారణంగా టీచర్లు సొంత ప్రాంతంలో ఉద్యోగం చేసుకునే అవకాశం కోల్పోతున్నారని బీజేపీ పేర్కొంది. జీవో 317పై నిరసనలు, ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని మండిపడింది..

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 317 జీవోను పునసమీక్షించాలని దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను కరోనా నిబంధనలు ఉల్లంఘించారని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. రిమాండ్‌ను హైకోర్టు రద్దు చేసింది. బుధవారం బండి సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలను వినిపించారు. ఈ మేరకు బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని బీజేపీ లీగల్ సెల్ మీడియాకు తెలిపింది.