
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. దీనిపై ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వగా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడుతుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది. 42శాతం బీసీ రిజర్వేషన్లను సవాల్‌గా తీసుకుని న్యాయం పోరాటానికి రెడీ అయింది. సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుండడంతో ఢిల్లీకి పంపేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు.. కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఢిల్లీ వెళ్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టులో వాదించబోతోంది. హైకోర్టు స్టే అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రాథమికంగా చర్చలు కూడా నిర్వహించింది రేవంత్ సర్కార్.
ప్రధానంగా.. BC రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందు తెలంగాణ ప్రభుత్వం చేసిన కసరత్తును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఇంటింటి సర్వే, ఏకసభ్య కమిషన్ ఏర్పాటు, ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఫైనల్ చేయడం లాంటి విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందు ఉంచుబోతోంది. తెలంగాణలో BC జనాభా 57.6 శాతం ఉన్నందునే ఆ వర్గానికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పబోతోంది. అంతేకాదు.. బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న విషయాన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల అమలపై హైకోర్టు స్టే ఇవ్వడం కరెక్ట్ కాదని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించబోతోంది. ఇక.. బీసీ రిజర్వేషన్ల అంశంపై వెనక్కి తగ్గేదిలేదన్నారు TPCC చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండడంతోనే సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే.. 42 శాతం రిజర్వేషన్ల అంశంపై మరో సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. నిన్న హైదరాబాద్‌తో మీడియా చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలనని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కిషన్‌రెడ్డి. మొత్తంగా.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో9పై హైకోర్టు స్టే ఇవ్వగా.. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుండడం ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో.. స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాలి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..