దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన.. ప్రతి జులైలో హైదరాబాద్‌ అడ్డాగా..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనతో ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించనున్నారు. ఇది పెట్టుబడుల ఒప్పందాలను వేగవంతం చేస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే విజన్‌ను సీఎం వివరించారు. AI, లైఫ్ సైన్సెస్ పాలసీలను ప్రారంభించారు.

దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన.. ప్రతి జులైలో హైదరాబాద్‌ అడ్డాగా..
Global Investments

Edited By:

Updated on: Jan 21, 2026 | 8:54 AM

ప్రతి ఏడాది జులై నెలలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనను సీఎం ముందుంచగా, గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు.
పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువగా మారిందని సీఎం స్పష్టం చేశారు. అందుకే జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించడం ద్వారా నిర్ణయాలను వేగవంతం చేయవచ్చని WEF ప్రతినిధులకు సూచించారు. ఇది పెట్టుబడుల అమలుకు కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంచనాలను మించి విజయవంతమైందని సీఎం గుర్తుచేశారు. ఈ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగిందని తెలిపారు. ఈ విజయంతో తెలంగాణ అభివృద్ధి విజన్‌ను ప్రపంచానికి చూపించేందుకే ఈసారి దావోస్‌కు వచ్చామని వెల్లడించారు.

హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందని సీఎం తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నైట్ టైమ్ ఎకానమీపై దృష్టితో హైదరాబాద్‌ను దేశంలోనే 24 గంటలు చురుకుగా పనిచేసే తొలి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. ఈ ఫ్యూచర్ సిటీలో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఇది సస్టైనబుల్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు మోడల్‌గా నిలవనుందని పేర్కొన్నారు.

‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రపంచానికి ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030లను అధికారికంగా ఆవిష్కరించారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, చెరువులు–కుంటల పునరుజ్జీవనం వంటి కీలక ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను కూడా ప్రస్తావించారు.

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రులు స్పష్టం చేశారు. టెక్నాలజీ, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారాన్ని రాష్ట్రం స్వాగతిస్తుందని తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ నమ్మకమైన గమ్యంగా మారుతోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో పాల్గొని, తెలంగాణ విజన్‌కు తన మద్దతును తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..