Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గని స్పీకర్ పోచారం.. సభ నిర్ణయమే ఫైనల్..

|

Mar 15, 2022 | 11:06 AM

పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు.

Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గని స్పీకర్ పోచారం.. సభ నిర్ణయమే ఫైనల్..
Pocharam Srinivas
Follow us on

Telangana Assembly: పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. సభ నిర్ణయమే తుది నిర్ణయమని.. పోచారం స్పష్టంచేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రెస్ మీట్‌కు కూడా అనుమతి నిరాకరించారు. కాగా, ముందుగా అసెంబ్లీ సెక్రటరీ (Telangana Assembly secretary) ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు మంగళవారం ఉదయం కలిశారు. హైకోర్టు సూచన మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకు అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్లారు. అప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే సస్పెన్షన్ ను ఎత్తివేసేది లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెగేసి చెప్పడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ రోజుతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

శాసనసభ సమావేశాలకు అనుమతించాలని సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్పీకర్ దే తుదినిర్ణయమని హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. సస్పెన్షన్ ఎత్తివేతపై నిర్ణయం స్పీకర్‌దే అని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఈ ఆర్డర్ కాపీతో సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గ్గురు ఇవాళ అసెంబ్లీకి వచ్చారు.. అయితే లోపలికి అనుమతి నిరాకరించారు. హైకోర్టు ఆర్డర్ ను చూపగా ముందుగా కార్యదర్శిని, ఆ తర్వాత స్పీకర్‌ను కలిశారు.