TS Assembly: కొలువుదీరిన అసెంబ్లీ.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. కాసేపట్లో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

|

Dec 09, 2023 | 9:00 AM

నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. తొలిరోజు సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం, ధన్యవాద తీర్మానం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ అన్ని పార్టీల తరఫున మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

TS Assembly: కొలువుదీరిన అసెంబ్లీ.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. కాసేపట్లో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
Akbaruddin
Follow us on

తెలంగాణలో కొత్తగా గెలిచిన 119 ఎమ్మెల్యేలు, అధ్యక్షా.. అనే సమయం ఆసన్నమైంది. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతోంది. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ హోదాలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయిస్తారు. అయితే.. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే, తాను ప్రమాణం చేయబోనంటూ ప్రకటించారు గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌.

నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. తొలిరోజు సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం, ధన్యవాద తీర్మానం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ అన్ని పార్టీల తరఫున మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్‌ జిల్లా నుంచి 8 మంది, ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఇక 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే కావడం విశేషం.

తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేల చేత ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్‌ శాసన సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీని ప్రొటెమ్‌ స్పీకర్‌గా నామినేట్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రొటెమ్‌ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ చేత రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సహచరులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా సీనియర్‌ సభ్యులకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో భాగంగా ప్రొటెమ్ స్పీకర్ గా వ్యవహారించాలని అక్బరుద్దీన్‌ను కోరగా అందుకాయన అంగీకరించారు.

ఇక ఉదయం 11 గంటలకు ప్రొటెమ్‌ స్పీకర్‌ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఇదిలావుంటే, మొత్తం 119 మంది సభ్యులు కలిగిన తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు విజయం సాధించారు. అధికార కాంగ్రెస్‌ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశముంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్‌ హౌజ్‌లో భేటీ అయ్యారు.

కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ శనివారం సాయంత్రం వెలువడనుంది. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ ‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రతిపాదించింది. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్‌ సమర్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా రెండో రోజు ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఈ ఎన్నిక పూర్తయిన వెంటనే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం కొత్త స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిసెంబర్ 11న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి డిసెంబర్ 12వ తేదీన ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..