
Telangana Assembly Elections 2023: ఓ వైపు బీజేపీ బీసీ నినాదం.. మరోవైపు కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌లతో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రచార హోరును కొనసాగిస్తోంది. సకల జనులకు అండ.. ట్యాగ్ లైన్‌తో బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈనెల 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోదీ సభ నిర్వహించనుంది. నరేంద్రమోదీ బీసీ గర్జన సభకు స్థానిక బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. సభ ఏర్పాట్లను బీజేపీ ప్రతినిధుల బృందం పరిశీలించింది.
ఈ మధ్యే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూర్యాపేట సభలో బీసీ సీఎం నినాదాన్ని ప్రకటించి సంచలనం రేపారు. మెజార్టీ శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల్లో బీజేపీ సీఎం నినాదాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రధాని మోదీ బీసీ గర్జన సభతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తోంది కమలం పార్టీ.
తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇప్పటికే డిక్లరేషన్‌లు, బస్సుయాత్రలు, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ, రైతు, మహిళ డిక్లరేషన్‌లు ప్రకటించిన టీ కాంగ్రెస్.. మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించబోతుంది. ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించాలని భావిస్తోంది. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని, మైనార్టీలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించి, వారికి తమవైపు ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల టైం దగ్గరపడేకొద్దీ.. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ప్రధాన పార్టీలు పోటాపోటీగా డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నాయి. మరి ఈ డిక్లరేషన్‌లతో ఏపార్టీకి ఎంత ప్రయోజనం చేకూరుతుందనేది..ఎన్నికల ఫలితాల తర్వాత తేలిపోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..