AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోరుగడ్డలో నిలిచేదెవరూ..? క్లీన్ స్వీప్ చేస్తామంటున్న బీఆర్ఎస్.. మెజారిటీ సీట్లు మావే అంటున్న విపక్షాలు..!

తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో.. లేదో.. ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశాయి అన్ని పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే జోరు మీదుంది.

పోరుగడ్డలో నిలిచేదెవరూ..? క్లీన్ స్వీప్ చేస్తామంటున్న బీఆర్ఎస్.. మెజారిటీ సీట్లు మావే అంటున్న విపక్షాలు..!
Bjp - Congress - BRS
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 11, 2023 | 3:52 PM

Share

తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో.. లేదో.. ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశాయి అన్ని పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే జోరు మీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను చుట్టేస్తుంటే, త్వరలో గులాబీ బాస్‌ రంగంలోకి దిగబోతున్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్‌ సభతో సమరశంఖం పూరించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.

మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి.. ఊరూరా జేఏసీలు ఏర్పడి రాజకీయ యుద్ధం చేసిన పోరాట గడ్డ.. తొలి సింహగర్జన.. తెలంగాణ రాష్ట్ర సమితి సారథిగా కేసీఆర్ అరెస్ట్ అయ్యిన ప్రాంతం అదీ. అదీ నుంచి ప్రజలు కూడా టీఆర్ఎస్‌కు బాసటగా నిలిచారు.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ అండగా ఉంటూ వస్తున్నారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ… ఇక్కడ సత్తా చాటింది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్… 2014, 2018 ఎన్నికల్లో.. దూసుకెళ్లింది. మరోసారి కూడా క్లీన్ స్వీప్ చేస్తామన్న ఉత్సాహంతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ఈసారి ఎలాగైనా.. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. ఇప్పటికే.. బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలతో జనానికి దగ్గరవుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. 2018 ఎన్నికల్లో 13 స్థానాలకు గానూ.. 11 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. రామగుండంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందిన కోరుకంటి చందర్.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. మంథనిలో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. అదే విధంగా 2014 ఎన్నికల్లో.. 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, జగత్యాలలో కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి గెలిచారు. అయితే, ఈసారి 13 స్థానాల్లో విజయం సాధించి.. మరోసారి గులాబీ జెండా సత్తాను చాటుతామని నేతలు చెబుతున్నారు.

జిల్లాలో ముఖ్యమైన నేతలు బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల నుంచీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, కరీంనగర్ నుంచీ మంత్రి గంగుల కమలాకర్, ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉంటున్నారు. ముందగానే.. అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్ అభ్యర్తులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమ పథకాలే జనానికి బీఆర్ఎస్‌ను మరింత దగ్గర చేస్తున్నాయని నేతలు ధీమాతో ఉన్నారు. తమ గెలుపును ప్రతిపక్షాలకు అడ్డుకునే శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు ధీమాతో చెబుతున్నారు.

గత ఎన్నికల్లో మంథనిలో శ్రీధర్ బాబు ఒక్కరే కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, 8 నుంచి పది స్థానాల్లో విజయం సాధిస్తామని అంటున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ నుంచి ముఖ్యమైన నేతలు బరిలోకి దిగే అవకాశాలు కనపడుతున్నాయి. మంథని నుంచి మరోసారి శ్రీధర్ బాబు అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.. ఈసారి ఖచ్చితంగా అధిక స్థానాల్లో గెలుస్తామనే దీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే.. బీజెపీ నేతలు కూడా గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీఆర్ఎఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున విజయం సాధించారు. మరోసారి రాజేందర్ ఇక్కడి నుంచే బరిలో దిగనున్నారు. అదే విధంగా.. బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈసారి కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. కోరుట్ల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాము 7 నుంచి 8 స్థానాల్లో గెలిచి తీరుతామంటున్నారు.

మొత్తానికి.. మూడు పార్టీల్లో గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు నేతలు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థులను దసరా కల్లా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక అభ్యర్థులు ప్రకటించిన తరువాత ప్రచారంలో దూసుకెళ్తామని విపక్ష నేతలు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి