Telangana Election: ఈనెల 27న కరీంనగర్‌కు మోదీ.. ఎస్సారార్ కాలేజీలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

| Edited By: TV9 Telugu

Nov 23, 2023 | 11:04 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 27వ తేదీన కరీంనగర్‌లో రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల గౌరిశెట్టి వెంకటయ్య మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు.

Telangana Election: ఈనెల 27న కరీంనగర్‌కు మోదీ.. ఎస్సారార్ కాలేజీలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
Narendra Modi says BRS and Congress are same, Telangana Election Campaign In Tupran
Follow us on

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 27వ తేదీన కరీంనగర్‌లో రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల గౌరిశెట్టి వెంకటయ్య మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి హోదాలో తొలిసారి నరేంద్ర మోదీ కరీంనగర్ వస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది భారతీయ జనతా పార్టీ.

ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఎన్నికల సభను విజయవంతం చేసేందుకు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. బహిరంగ సభకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులంతా సభకు హాజరుకానున్నారు. అటు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ…తొలిసారి ప్రధాని హోదాలో మోదీ వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో దిగ్విజయ వంతం చేయాలని పార్టీ శ్రేణులకు, కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాక కోసం కరీంనగర్ ప్రజానీకం ఎదురు చూస్తోందని, ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామం, మండలం నుండి భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

బీసీ సీఎం అంశమే ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే బీసీ సీఎం నినాదాన్ని అందుకుంది. ఈ విషయాన్ని స్వయంగా హోంమంత్రి అమిత్‌షా సూర్యాపేట సభలో ప్రకటించి సంచలనం సృష్టించారు. అనంతరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారని స్పష్టం చేశారు.

మెజార్టీ ఓటర్లయిన బీసీల ఓట్లు రాబట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లను ఇప్పటి వరకు అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప వారిని రాజ్యాధికారంలోకి తీసుకురావడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోదీ కరీంనగర్ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…