Telangana Budget 2021 Date: మార్చి 18న తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌.. ప్రత్యేక రాష్ట్రమొచ్చాక బడ్జెట్ కేటాయింపుల లెక్కలివే..!

| Edited By: Ram Naramaneni

Mar 16, 2021 | 11:53 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి అప్పుడే ఏడేళ్ళు కావస్తోంది. 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేడేళ్ళుగా బడ్జెట్ ప్రజెంటేషన్లను చూస్తున్నాం. మరోసారి బడ్జెట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో గత బడ్జెట్ల హైలైట్స్ ఓసారి చూద్దాం..

Telangana Budget 2021 Date: మార్చి 18న తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌.. ప్రత్యేక రాష్ట్రమొచ్చాక బడ్జెట్ కేటాయింపుల లెక్కలివే..!
Telangana Assembly
Follow us on

Telangana Assembly Budget Session: మార్చి 18వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ముందుకు రాష్ట్ర వార్షిక బడ్జెట్ రానున్నది. సోమవారం (మార్చి 15న) చట్టసభల బడ్జెట్ సెషన్ ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగిన శాసనసభా కార్యకలాపాల సలహా సంఘం (బీఏసీ) భేటీ అయి మార్చి 18వ తేదీన బడ్జెట్ సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్చి 16, 17 తేదీల్లో ఉభయ సభల్లోను గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. మార్చి 18న బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం రోటీన్ ప్రాసెస్‌లో బడ్జెట్‌కు సభ ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదంతో ఉభయ సభలు వాయిదా పడతాయి. మార్చి 26వ తేదీ వరకు చట్ట సభల బడ్జెట్ సమావేశాలు కొనసాగనుండగా.. చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్లు) ఆమోదం కోసం కేటాయించారు.

2021- 2022 సంవ‌త్సరానికిగాను వార్షిక బ‌డ్జెట్‌ను మార్చి 18వ తేదీన ప్రవేశ పెట్టనుంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపులను ఒక్కసారి చూద్దాం.. 2014-15 తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. లక్షా 637 కోట్ల రూపాయల బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.51, 989 కోట్లు కాగా.. ప్రణాళికా వ్యయం రూ.48,648 కోట్లు. ఆర్థిక లోటును రూ.17,398 కోట్లుగా ఆర్థిక మంత్రి చూపించారు. 2015-16 తెలంగాణ వార్షిక బడ్జెట్‌ సైజు పెరిగింది. మొత్తం బడ్జెట్ వాల్యూ రూ.1,15,689.19 కోట్లు. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లు, ప్రణాళికా వ్యయం రూ.52,383.19 కోట్లు. రెవెన్యూ వసూళ్ళను రూ.94,131గా మంత్రి ప్రతిపాదించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వార్షిక బడ్జెట్ మొత్తం రూ.1,30,415.87 కోట్లకు చేరింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.67,630.73 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.62,785.73 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులును రూ.3,718.37 కోట్లుగాను, ద్రవ్య లోటును రూ.23,467.29 కోట్లుగాను బడ్జెట్‌లో చూపించారు.

2017-18లో వార్షిక బడ్జెట్‌ మొత్తం ఏకంగా రూ. 1,49,446 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు, ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు, ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 4,571 కోట్లు, వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 46,946 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 5,942 కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. 2018-19లో తెలంగాణ వార్షిక బడ్జెట్‌
తెలంగాణ బడ్జెట్‌ మొత్తం రూ.1,74,453 కోట్లకు పెరిగింది. ప్రగతి పద్దును రూ.1,04,757 కోట్లుగాను, నిర్వహణ పద్దును రూ. 69,695 కోట్లుగాను ప్రతిపాదించారు. రెవెన్యూ ఆదాయం రూ. 1,30,975 కోట్లుగాను, రెవెన్యూ వ్యయం రూ.1,25,454 కోట్లుగాను, రెవెన్యూ మిగులు రూ.5,520.41 కోట్లుగాను చూపించారు. ఇందులో రాష్ట్ర పన్నుల ద్వార ఆదాయాన్ని రూ. 73,751 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.8,973 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ. 19,207 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్లు రూ. 29,041 కోట్లుగాను అంఛనాలు చూపించారు. రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ. 33,369 కోట్లు, రుణాలు, అడ్వాన్సుల రూపంలో రూ. 9,035, పెట్టుబడులకు చెల్లింపుల రూపంలో రూ. 6,594, ద్రవ్య లోటును రూ. 29,077 కోట్లుగాను ప్రతిపాదించారు.

2019-20 సంవత్సరానికిగాను రూ.1, 46,492 కోట్లతో ఫుల్ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2019 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ స్వయంగా బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు, బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు, ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లుగాను చూపించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,82,914.42 కోట్లలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. 2020 మార్చి 8వ తేదీన హరీశ్ రావు సభలో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లుగాను ప్రతిపాదించారు.

ALSO READ: తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ALSO READ: ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల