Telangana Assembly Sessions Live Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న దృష్ట్యా కరోనా నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే సోమవారం అసెంబ్లీ వేదికగా పీఆర్‌సీపై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరోనా విషయమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో పారిశ్రామీకీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఎలాంటి సాయం అందలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. ఆరున్నరేళ్లలో తెలంగాణకు కేంద్రం అణా పైసా కూడా సహాయం చేయలేదు. కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా అని ఆరోపించారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్బంగా నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వరంగల్ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూములను గుర్తించారని తెలిపారు. ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోని సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించామన్నారు. జిల్లా కలెక్టర్ త్వరలోనే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు.
ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ర్టం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం రూ. 97,405 కోట్ల పెట్టుబడులు తమ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా 15,52,672 మందికి ఉపాధి కల్పించొచ్చని అంచనా వేశామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గొర్రెల యూనిట్ల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ర్టంలో గొర్రెల పంపిణీ తర్వాత దాని నుంచి వచ్చిన సంపద రూ. 5,490 కోట్లు అని మంత్రి తెలిపారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 4 వేల 587 కోట్ల 20 లక్షలను ఖర్చు చేసిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ర్టంలోని కులవృత్తులకు ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. సీఎం సంకల్ప బలం చాలా గొప్పదని. గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి చెప్పుకొచ్చారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలల స్థాయి పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు 204 అల్పాసంఖ్యాక వర్గాలకు పాఠశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. 2018-19లో 12 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. 2020-21లో 71 టీఎంఆర్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని వివరించారు. మైనార్టీ వర్గాల్లోని ముస్లింలు, క్రైస్తవులతో పాటు ఇతర వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ప్రారంభించారని చెప్పుకొచ్చారు.