ఏసీబీ అంటూ ఫోన్లు వచ్చినా భయపడకండి.. జస్ట్ ఇలా చేయండి చాలు!
తెలంగాణలోని ఏసీబీ అధికారుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, నకిలీ అధికారులు ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీబీ హెచ్చరించింది. కేసుల నమోదును నివారించడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు ఎప్పుడూ డబ్బులు అడగరని స్పష్టం చేస్తూ, నకిలీ కాల్స్ వస్తే 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

తెలంగాణలో నకిలీ ఏసీబీ అధికారులు ఉన్నారని, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఏసీబీ అధికారులమంటూ వసూళ్లు చెయ్యడం తమ దృష్టికి వచ్చిందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చెయ్యకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. ఏసీబీ అధికారులు డబ్బులు డిమాండ్ చేయరని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. అలా ఎవరైనా తాము ఏసీబీ అధికారులమని, తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, వారిని నమ్మవద్దని ఏసీబీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఓ నకిలీ ఏసీబీ అధికారిపై ఖమ్మం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విషయమై ఏసీబీ అధికారులు పలు సూచనలు చేశారు.
ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి, సామాన్య ప్రజలకు ఏవైనా నకిలీ కాల్స్ వస్తే, వారు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించవచ్చని వెల్లడించారు. ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వాట్సాప్ నంబర్ 94404 46106, ఫేస్‌బుక్ ఐడీ Telangana ACB, ట్విట్టర్ ఐడీ @TelanganaACB ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇలాంటి ఫిర్యాదులు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా ఏసీబీ అధికారులు హామీ ఇచ్చారు. మీకు కూడా ఎవరైనా ఫోన్ చేసి, తాము ఏసీబీ అధికారులం అని, తమ వద్ద మీరు అవినీతి చేసినట్లు ఆరోపణలు వచ్చినట్లైతే వెంటనే అసలైన ఏసీబీ అధికారులను పైన చెప్పిన వివరాల ఆధారంగా సంప్రదించండి. మోసాల నుంచి రక్షణ పొందండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
