హైదరాబాద్‌లో వీధికుక్కల బెడద ఇంకా తగ్గలేదు. బయటికి వెళ్తామంటే ఇప్పటికీ కుక్కలు హడలెత్తిస్తూనే ఉన్నాయి. ఎవరైనా కనిపిస్తే చాలు.. పిక్కలు పీకేస్తున్నాయి వీధి కుక్కలు. ఎక్కడికెళ్లినా, ఏ విధిలో చూసినా గుంపులుగుంపులుగా సంచరిస్తూ వణుకుపుట్టిస్తున్నాయి. దీంతో స్థానికులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నేరేడ్‌మెట్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాయి. స్థానిక కాకతీయనగర్‌లో ఒక వృద్ధురాలిని వీధి కుక్క కరవడంతో అతని కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అలాగే.. నేరేడ్‌మెట్ పరిధిలోనే.. వెస్ట్ శ్రీకృష్ణనగనర్‌లో ఒక చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేయబోయాయి. అయితే.. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.
ప్రస్తుతం దీనికి సంబంధించి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు మూడు వీధికుక్కలు చిన్నారిపైకి ఎగబడబోయాయి. తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అయినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. అయితే పాపకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆమె తల్లితండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తంగా.. వీధి కుక్కల బెడదతో హైదరాబాద్ ప్రజలు ఇంకా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా వీధి కుక్కల బీభత్సంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. ఇప్పటికైనా.. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి అప్రమత్తం కావాలని.. వీధి కుక్కలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి.