దొంగలందు మహా దొంగలు వేరయా.. అన్న మాటను నిజం చేస్తున్నారు కొందరు దొంగలు. చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. దొంగతనానికి ఒక అడ్డూఅదుపు ఉంటుందా..! తేరగా ఏది దొరికినా కొట్టేసి పారిపోయేవాళ్లే ఇలాంటి వాళ్లు. ఇక్కడ జరిగిన ఘటన చూస్తే అలాగే అనిపిస్తుంది మరీ..! ఈ దొంగకు ఇంకా ఏం విలువైనవి ఏమీ దొరకలేదా? అసలు ఇవి కూడా దొంగతనం చేయడానికి వస్తారా? మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించక మానదు మీకు కూడా విషయం ఏంటో తెలిస్తే. అసలు ఈ వింత దొంగ కథాకమామీషు ఏంటో చూద్దాం పదండి.
హైదరాబాద్ నగరం అంబర్‌పేట్ ప్రాంతం ప్రేమ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ దొంగ దూరాడు. సరే ఏదో ఇల్లుకు కన్నం వేసి విలువైన వస్తువులు దోచుకెళ్తాడు అనుకుంటాం ఎవరైనా. కానీ, ఆ దొంగ ఏం చేశాడో తెలుసా? అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లోర్‌కి చేరుకున్న ఆ దొంగ అక్కడ ఉన్న కొత్త చెప్పులు, షూస్ ఎత్తుకెళ్లడానికి వచ్చాడు. ఎదురెదురుగా రెండు ఇళ్ల బయట స్టాండ్‌లో పెట్టిన చెప్పులను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. చెప్పులను తీసి పరిశీలిస్తూ కింద ఓ పక్కన పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న మరో ఇంటి ముందు ఉన్న చెప్పులను కూడా తెచ్చుకున్నాడు. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయింది.
ఆ ఫ్లోర్‌లో సర్దేసుకున్న దొంగ తర్వాత పై ఫ్లోర్‌కి మెట్ల మార్గం ద్వారా మెల్లగా జారుకున్నాడు. మరి పైన ఫ్లోర్ నుంచి కూడా చెప్పులను దొంగతనంగా తెచ్చేసుకోవాలి అనుకున్నాడో ఏమో. పైగా ఇక్కడ గమ్మత్తు ఏంటంటే.. ఏదో చెప్పుల షాపుకు వెళ్లి డబ్బులు పెట్టి మరీ కొన్నవాడిలాగా అక్కడ ఉన్న చెప్పులు, షూలను తీరిగ్గా పరిశీలిస్తూ ఎంపిక చేసుకోవడం గమనార్హం. అసలు ఏ బాదరబందీ లేకుండా చాలా నింపాదిగా అతను దొంగతనం చేయడం మనం అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో గమనించవచ్చు. ఆ వ్యక్తి చూడడానికి కూడా యుక్త వయసు వాడిలాగే ఉన్నాడు. ఏది ఏమైనా ఇలా చెప్పులను కూడా దొంగలు వదలరా అంటే.. ఇంకా ఎక్కడ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ఎవరైనా..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..