
ఎన్నికలు అనగానే ఓట్ల కోసం వచ్చే నేతల వద్ద తమ డిమాండ్లను పెట్టి సాధించుకుంటారు. కొన్ని సందర్భాల్లో సమస్యలపై నిరసనను కూడా వ్యక్తం చేస్తుంటారు. కానీ కొందరు నేతలు మాత్రం.. ఓటర్లకు ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వినూత్నంగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పాలకుల విధానాలకు నిరసనగా రిక్షాపై అర్థనగ్న ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసి నిరసన తెలిపారు ఓ అభ్యర్థి. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన పూస శ్రీనివాస్ సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తి. తరుచూ పాలకుల విధానాలను కూడా ప్రశ్నిస్తుంటాడు. ప్రజా సమస్యలపై పాలకులకు నిరసన వ్యక్తం చేసేందుకు అనేక పద్ధతులు ఉన్నప్పటికీ, శ్రీనివాస్ మాత్రం వెరైటీ పద్ధతిని ఎంచుకున్నాడు. గెలుపోటములు పక్కనబెడితే, పట్టువదలని విక్రమార్కడిలా.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నామినేషన్ వేస్తుంటారు. భువనగిరి నియోజకవర్గంలో వరుసగా ఐదవ సారి నామినేషన్ దాఖలు చేసిన పూస శ్రీనివాస్.. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన వినూత్నంగా వెళ్లి నామినేషన్ వేస్తుంటాడు.
మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు శ్రీనివాస్, ఈ క్రమంలోనే భువనగిరి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు పూస శ్రీనివాస్ వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చాడు. కార్యాలయంలోకి వెళ్లి శివసేన పార్టీ అభ్యర్థిగా పూస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశాడు. ప్రజా సమస్యలపై తాను చేస్తున్న నిరసనను పాలకులు పట్టించుకోవడంలేదని.. అర్ద నగ్న ప్రదర్శన ద్వారా నామినేషన్ దాఖలు చేశారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశానని ఆయన అంటున్నారు. ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు అర్ధ నగ్న ప్రదర్శనగా వెళ్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..