పూర్తి సహకారం అందిస్తాం.. సురక్షితంగా తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్..!

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో అపశ్రుతి చేసుకుంది. టన్నెల్‌ పైభాగం ఒక్కసారిగా కృంగిపోయింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోన్ చేశారు. SLBCలో ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో టన్నెల్‌లో ఉన్న కార్మికులు ఎందరు? అందులో చిక్కుకుపోయిన వారెందరు? అడిగి తెలుసుకున్నారు.

పూర్తి సహకారం అందిస్తాం.. సురక్షితంగా తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్..!
Pm Modi Calls Cm Revanth

Updated on: Feb 22, 2025 | 7:36 PM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో అపశ్రుతి చేసుకుంది. టన్నెల్‌ పైభాగం ఒక్కసారిగా కృంగిపోయింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 42 మంది కార్మికులను సురక్షితంగా బయటకు రాగా.. 13 మందికి గాయాలయ్యాయి. మరో 8 మంది లోపల చిక్కుకున్నారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ

ఐదేళ్ల సుధీర్ఘ విరామం తరువాత తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఉదయం 8.20 గంటల సమయంలో సొరంగమార్గం దగ్గర టన్నెల్‌ బోర్‌ మిషన్‌ బురదలో చిక్కుపోయింది. సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్‌ సెగ్మెంట్స్‌ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.

టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచి పోగా అధికారులు దానిని పునరుద్ధరించారు. టన్నెల్‌ 14వ కిలోమీటర్‌ వద్ద నాలుగు అడుగుల మేర నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోపల ఉన్నవారికి రక్షించేందుకు కేంద్ర ఆర్మీని సాయం కోరింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ తెలిపారు. లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..