Telangana: అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది..

కొడుకులే లోకం అనుకుంది.. కళ్ల ముందే వాళ్లు పెరిగి పెద్దై, తమకు అండగా ఉంటారని కలలు కంది. కన్నబిడ్డలపై ఆమె పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. అస్తి పంపకాలతో పాటు అమ్మను కూడా పంచుకున్న కొడుకులు... చివరికి ఆమెను అనాథలా వదిలేశారు. ఈ అమానుష ఘటన జగిత్యాలలో జరిగింది.

Telangana: అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది..
Sons Abandon Elderly Mother

Edited By: Krishna S

Updated on: Dec 07, 2025 | 9:55 AM

ఆపదలో అండగా ఉంటారని నమ్ముకున్న సొంత కొడుకులే చివరికి ఆమెను నమ్మించి, నిస్సహాయ స్థితిలో వదిలేసిన హృదయ విదారక ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. కొడుకుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు రోజంతా ఆర్డీవో కార్యాలయం ఎదుట తిండి, నీళ్లు లేకుండా చలికి వణికిపోతూ గడపాల్సి వచ్చింది. మల్యాలకు చెందిన కుర్రె లక్ష్మీ అనే వృద్ధురాలి భర్త నారాయణ దాసు మరణించడంతో ఆమె తన ఇద్దరు కొడుకులు కుర్రె కృష్ణ, కుర్రె శ్రీనివాస్ వద్ద ఉంటుంది. ఆస్తి పంపకాలలో భాగంగా చిన్న కొడుకు శ్రీనివాస్‌కు పాత ఇల్లు వచ్చింది. అతను తల్లిని బయట అద్దె ఇంట్లో ఉంచుతూ వచ్చాడు.

శ్రీనివాస్ ఆ పాత ఇంటిని కూల్చి కొత్త నిర్మాణం చేపట్టడంతో తల్లి లక్ష్మీని ఇంట్లోకి రానిచ్చేందుకు నిరాకరించాడు. దీంతో లక్ష్మీ పెద్ద కొడుకు కృష్ణ వద్ద ఉండాల్సి వచ్చింది. కృష్ణ కూడా సరిగా చూసుకోవడం లేదని భావించిన లక్ష్మీ సమస్యను పరిష్కరించుకోవడానికి చిన్న కొడుకు శ్రీనివాస్ వద్దకు వెళ్లగా, అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్యను పరిష్కరించే నెపంతో చిన్న కొడుకు శ్రీనివాస్.. “ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లు, నేను కూడా వస్తాను” అని తల్లిని నమ్మించి ఆటోలో జగిత్యాల ఆర్డీవో కార్యాలయానికి పంపించాడు. అయితే ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆ వృద్ధురాలి కోసం సాయంత్రం అయినా ఒక్క కొడుకు కూడా రాలేదు. దీంతో లక్ష్మీ ఆర్డీవో కార్యాలయం ఎదుటే తిండి, నీళ్లు లేకుండా, చలికి వణికిపోతూ నిరీక్షించింది.

ఆర్డీవో మధుకర్ కఠిన ఆదేశాలు

ఈ హృదయ విదారక దృశ్యాన్ని గమనించిన ఆర్డీవో మధుకర్ స్వయంగా ఆమె వద్దకు వచ్చి పరిస్థితిని ఆరా తీశారు. కొడుకులు తల్లిని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన విషయం తెలుసుకుని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి తల్లిని తక్షణమే ఇంటికి తీసుకెళ్లాలి. సోమవారం రోజు ఇద్దరు కొడుకులు తప్పనిసరిగా ఆర్డీవో కార్యాలయానికి హాజరుకావాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో ఆదేశాల మేరకు పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తల్లిని తన వెంట తీసుకెళ్లాడు. కొడుకుల నిర్లక్ష్యంతో అవమానానికి, చలి బాధలకు గురైన వృద్ధురాలి పట్ల ఆర్డీవో స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి