హైదరాబాద్, జనవరి 4: భార్యను కాపురానికి రానివ్వకుండా అడ్డుపడుతోందని అత్తను అతి కిరాతకంగా హత్యచేశాడు అల్లుడు. అంతేకాకుండా అడ్డొచ్చిన భార్యను గొంతుకోసిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదు. మనుషుల్లో రోజు రోజుకు క్రూరత్వం పెరిగిపోతోంది. వావివరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అడ్డొచ్చిన వారిని కడతేర్చడం, ఆపై కటకటాల పాలు కావడం పరిపాటిగా మారిపోయింది. వివాహ బంధాల్లో గొడవలు కొన్నైతే, వివాహేతర సంబంధాలతో మరికొన్ని హత్యలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో కుటుంబం ఏమవుతుందని ఆలోచించకుండా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడంతో భవిష్యత్ అంధకారంలో పడుతుందని పోలీసులు అంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లోని పద్మారావు కాలనీలో దారుణమైన సంఘటన జరిగింది.
రుద్రారం గ్రామానికి చెందిన సాయిబాబా అనే వ్యక్తికి ఇస్నాపూర్ గ్రామంలోని పద్మారావునగర్‌లో ఉంటున్న శాంతమ్మ కూతురు సత్యవతికి 2021 జనవరిలో వివాహం జరిగింది. కొంతకాలం వరకు సాఫీగా సాగిన కాపురంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. భార్యాభర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు. చాలాసార్లు పెద్దలు ఇద్దరికీ నచ్చజెప్పి గొడవలు సద్దుమణిగేలా చేశారు. అయితే గొడవలు ముదరడంతో కొంతకాలంగా భార్య సత్యవతి (22) ఇస్నాపూర్‌లోని పద్మారావునగర్‌లోని తన తల్లి శాంతమ్మ దగ్గరికి వచ్చి ఉంటోంది. భర్త సాయిబాబా పలుమార్లు గ్రామానికి వెళ్లి తన భార్యను కాపురానికి పంపాల్సిందిగా అత్తను కోరాడు. దానికి ఆమె నిరాకరించింది. ఆగ్రహానికి గురైన సాయిబాబా పద్మారావునగర్‌లోని అత్త శాంతమ్మ(40) ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి హత్య చేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న భార్య సత్యవతి అడ్డుపడడంతో ఆమె గొంతును కిరాతకంగా కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో భార్య సత్యవతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బంధువులు ఆమెను చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భార్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. చుట్టుపక్కల వారితో పాటు బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అత్త శాంతమ్మ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని, నిందితుడు సాయిబాబాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అంటున్నారు. ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని, నిందితుడికి తగిన శిక్ష పడేలా చేస్తామని పటాన్‌చెరు డీఎస్పీ పురుషోత్తమ్‌రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.