
పాములు అంటేనే చాలామందికి భయం. దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటారు. మరి అలాంటి పాము కాటు వేసే ముందు హెచ్చరిస్తుందా.? ఆ హెచ్చరికలు గుర్తించి పాముకాటు నుంచి తప్పించుకోవచ్చా.? పాము కాటుకు గురైతే ఏం చేయాలి, ఏం చేయకూడదు.? విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దానితోనే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే అవి విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేదీ కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుంది. పాము ఎదురైనప్పుడు ఏమాత్రం భయం లేకుండా కదలకుండా ఉండిపోతే అది మీ నుంచి దూరంగా వెళ్లిపోతుందని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది వివరించారు.
దేశంలో పాముకాటు కేసులు వర్షాకాలంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. పాములు శీతాకాలం మొత్తం నిద్రావస్థలో ఉంటాయి. ఎండాకాలంలో బయటకు వచ్చి గుడ్లు పెడతాయి. వర్షాకాలంలో పిల్లలు పుడతాయి. ఈ సమయంలో ఆహారం కోసం పాములు చురుగ్గా వేటాడుతూ కప్పలు, ఎలుకలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. అందుకే వర్షాకాలంలో ఇవి ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయని త్రివేది తెలిపారు. ఇళ్లలో వెలుతురు తక్కువగా ఉన్న గదుల్లోనే పాముకాటు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు గుర్తించారు. స్టోర్ రూంలు, కిచెన్లు, బెడ్‌రూంలు వంటి వెలుతురు తక్కువగా ఉన్న గదులు, వాటికి ఆహారం దొరికే ప్రదేశాల్లోకి ఇవి వెళ్తాయి. పాములు చీకటి ప్రదేశాల్లోనే దాక్కుంటాయి, వెలుగులో ఉండటానికి ఇష్టపడవని అన్నారు. దేశంలో ప్రధానంగా నాలుగు రకాల విషపూరిత పాములు ఉన్నాయి. కట్లపాము, నాగుపాము, రక్త పింజర, చిన్న రక్తపింజర ఈ లిస్టులో వస్తాయి.
కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కట్లపాము ఎప్పుడు కాటు వేస్తుందో చెప్పలేమని, మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ “బుస్ బుస్” అని శబ్దం చేస్తాయని త్రివేది చెప్పారు. కొన్ని పాములు శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్దం చేస్తుంటాయి. వాటి ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాముకాటు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నారు. కట్లపాము రాత్రివేళల్లో చురుగ్గా ఉండి, రాత్రంతా ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాముకాటు ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ఆయన తెలిపారు.
పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఉండే ప్రజలు పాముకాటుకు గురై చికిత్స తీసుకోవడం కన్నా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని పాముకాటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలని స్నేక్ క్యాచర్ చెబుతున్నారు.