రంగంలోకి త్రీఆర్ బూమర్ మిషన్.. SLBC టన్నెల్‌లో ఊపందుకున్న నిర్మాణ పనులు!

శ్రీశైలం లెఫ్ట్ బాంక్ కెనాల్ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ప్రమాదకరమైన షీర్ జోన్‌ విజయవంతంగా దాటి ముందుకు సాగుతున్నారు. మరోవైపు టన్నెల్ తవ్వకాల వేగాన్ని పెంచేందుకు జపాన్ నుంచి అత్యాధునిక యంత్రాన్ని తీసుకొచ్చారు. దీంతో టన్నెల్ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. గతేడాది ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SLBC టన్నెల్ తవ్వకాల్లో ఇంతకీ షీర్ జోన్‌ను ఎలా దాటారు..? కొత్త మిషన్‌తో పనులు ఎంత వేగంగా జరగనున్నాయో తెలుసుకుందాం.

రంగంలోకి త్రీఆర్ బూమర్ మిషన్.. SLBC టన్నెల్‌లో ఊపందుకున్న నిర్మాణ పనులు!
Slbc Tunnel Project Update

Edited By:

Updated on: Aug 26, 2026 | 8:48 PM

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలన, రైతాంగానికి సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో 1983లో SLBC ప్రాజెక్ట్‌కు పునాది పడింది. అయినప్పటికీ రెండు దశాబ్దాలు పాటు ఎలాంటి పనులు జరగలేదు. 2004 లో జిల్లా ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు పనులు ప్రారంభమయ్యాయి. గ్రావిటీ ద్వారా శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నది నుంచి నీటిని తరలించేందుకు 43.9కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం చేయాలని భావించారు. ఈ టన్నెల్ ఇన్ లేట్ దోమలపెంట సమీపంలో ఉండగా, ఔట్ లెట్ మన్నెవారిపల్లి వద్ద ఉంది.

గతేడాది బ్రహ్మగిరి(దోమలపెంట) ఇన్ లెట్ వైపున 13.5 కిలోమీటర్ వద్ద ఆకస్మత్తుగా పై కప్పు కూలడంతో పెను ప్రమాదం సంభవించింది. ఘటనలో 8మంది మరణించగా.. కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. సుధీర్ఘ సహాయక చర్యల ఆపరేషన్ చివరికి విషాదంతోనే ముగిసింది. తవ్వకాలు జరిపే TMB మెషిన్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదం తర్వాత టన్నెల్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు

ఇక ప్రమాదం ముందు బ్రహ్మగిరి ఇన్ లెట్ వైపున 13.936కిలోమీటర్లు పూర్తయింది. మన్నెవారిపల్లి ఔట్ లెట్ వైపు 20.435కిలో మీటర్లు సొరంగం తవ్వారు. ఇక ప్రమాదం జరిగే నాటికి ఇంకా 9.533కిలో మీటర్ల టన్నెల్ తవ్వకం మిగిలి ఉంది. ఇది పూర్తి చేస్తేనే ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్లగొండకు నీళ్లు చేరేది. ఈ క్రమంలో తదుపరి కార్యచరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయాలని భావించింది. ఈ క్రమంలో టన్నెల్ రూట్ మ్యాప్ లో మొత్తం భూ ఉపరితలం ధృడత్వంపై సర్వే చేయాలని నిశ్చయించారు. ప్రతిష్టాత్మకంగా హెలీ బోర్న్ మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే నిర్వహించారు. టన్నెల్ మార్గంలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఆధ్వయనం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి పనులు పునః ప్రారంభించారు.

ప్రమాదకర షీర్ జోన్ దాటిన తవ్వకాలు

SLBC టన్నెల్ తవ్వకాల్లో ప్రధానంగా బ్రహ్మగిరి ఇన్ లెట్ వైపున 13.5 కిలోమీటర్ షీర్ జోన్‌ అతిపెద్ద సవాల్‌గా మారింది. భూగర్భంలో రాళ్ల పొరలు బలహీనంగా ఉండే ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం అత్యంత ప్రమాదకరం. అందుకే నేరుగా ముందుకు వెళ్లకుండా.. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ షీర్ జోన్ వద్ద బైపాస్ టన్నెల్ తవ్వారు. 100 మీటర్లు వెనక్కి వచ్చి సమాంతరంగా ముందుకు సాగారు. 136 మీటర్ల వద్ద షీర్ జోన్‌ను దాటి ఇప్పుడు ప్రధాన సొరంగం పనులు కొనసాగిస్తున్నారు. అయితే 8 – 12 మీటర్ల ప్రమాదకరమైన షీర్ జోన్ గుర్తించారు ఇంజినీర్లు. టన్నెల్ పైకప్పు, గోడల నుంచి రాళ్లు ఊడిపడకుండా ISHP రిబ్స్‌ను స్టీల్ రిబ్స్, రాక్ బోల్ట్స్ బిగించారు.

జియాలజిస్టులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సార్లు భూ పొరల పరిశీలన తర్వాతే పనులు ముందుకు సాగిస్తున్నారు. ఇక ఇప్పటివరకు మన్నెవారిపల్లి వైపు 379మీటర్లు, అటు బ్రహ్మగిరి వైపు 136 మీటర్లు తవ్వారు. మొత్తంగా ఎస్ఎల్బీసీ ఇన్‌లెట్, ఔట్‌లెట్ ప్రాంతాల్లో ఇప్పటివరకు 515 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇక పనుల వేగాన్ని మరింత పెంచేందుకు జపాన్ నుంచి త్రీఆర్ బూమర్ మిషన్‌ను ప్రత్యేకంగా తెప్పించారు. ఇప్పటికే అవుట్‌లెట్‌లో ఈ మిషన్‌తో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మరో నెల రోజుల్లో ఇన్‌లెట్‌లోనూ త్రీఆర్ బూమర్ మిషన్‌ను రంగంలోకి దించనున్నారు.

రంగంలోకి త్రీఆర్ బూమర్ మిషన్

త్రీఆర్ బూమర్ మిషన్ రాకతో టన్నెల్ పనుల్లో వేగం మరింత పెరగనుంది. ఇన్‌లెట్, ఔట్‌లెట్ రెండు వైపులా కలిపి రోజుకు 17 మీటర్ల వరకు టన్నెల్ తవ్వే సామర్థ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎదురైన భౌగోళిక, సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నామని.. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి టన్నెల్‌ను పూర్తి చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

అయితే మరో నాలుగు ప్రాంతాల్లో షీర్ జోన్లు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. ఒకవైపు ప్రమాదకరమైన షీర్ జోన్‌ను దాటి ముందుకు పనులు ముందుకు సాగుతుండగా.. మరోవైపు అత్యాధునిక మిషన్లతో మరింత వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే 2028 మే నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్గాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us