
బీఆర్ఎస్, కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొందరు తమకు తామే తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారన్నారు. ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలుపెడుతున్నారని ఎద్దేవా చేశారు. వారి హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా అని సీఎం ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.. చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని సీఎం గుర్తు చేశారు. ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని, ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, తెలంగాణ సమాజానికి అవమానం జరిగిందని ప్రచారం చేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేశారని, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తేనే ఏదో జరిగినట్లు రాద్దాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని, పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాళ్లు ఉద్యమకారులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకుని.. హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదన్నారు.
ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం అని ప్రశ్నించారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారికి ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారని, శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారని, ఇది ప్రజాస్వామ్య యుగమని, మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారికి దక్కడం సముచితమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తొలి తరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే, మలి తరంలో జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తి నింపారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. 2019 లో నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన వారు రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డిని తాను కోరానని గుర్తు చేశారు. ఆ సమయంలో తరం మారింది.. ప్రత్యక్ష రాజకీయాలకు తను దూరం అని, యువతరం రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డి తనను ప్రోత్సహించారని తెలిపారు. సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనని గౌరవించిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి అని సీఎం అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిబద్ధత ప్రధాని మోదీని భయపెడుతుందని, ఆయనను రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిగా బరిలో దించారన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించాలనే ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి రావి నారాయణరెడ్డి పురస్కారం అందించడం సముచితమని ముఖ్యమంత్రి తెలిపారు.
అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆయన పోరాడారన్నారు. బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి అని తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. దేశంలో మొట్ట మొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారన్నారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్టమొదటి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారని సీఎం తెలిపారు. అరవై ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణరెడ్డి అన్నారు. ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. సచివాలయంలోఅందరితో సమావేశమై తెలంగాణలో సముచిత గౌరవం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ రహస్య ఎజెండా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం దేశంలో ఏక పార్టీ, ఏక వ్యక్తి వ్యవస్థను తీసుకువచ్చే కుట్ర చేస్తోందన్నారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదం ఫలించకపోవడంతో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయాలని బీజేపీ SIR ను తీసుకువచ్చిందన్నారు. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు. నాణానికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు నిలిచి రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..