
కాగితపు పరిశ్రమ కంచుకోట.. వలస పులుల ఖిల్లా సిర్పూర్ నియోజక వర్గం (Sirpur Assembly Election). బతుకుదెరువు కోసం వలసొచ్చిన బెంగాలీలు, దక్షిణాది రాష్ట్రాల వలస కూలీలతో మిని ఇండియాగా కొనసాగుతోంది. పార్టీలతో సంబందం లేకుండా ఇండిపెండెంట్లను ఎమ్మెల్యే సీటుపై కూర్చోపెట్టిన రాజకీయ ఘన చరిత్ర సిర్పూర్ నియోజకవర్గ సొంతం. వరుసగా డబుల్ విక్టరీ కొట్టి ముచ్చటగా హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కారు జోరుకు కల్లెం వేయాలని ప్రతిపక్షాలు సైతం ఆ స్థాయిలోనే పోరాటం చేస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,26,874 మంది ఓటర్లున్నారు. 2023 ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో 81.66 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఈసారి ఎలాగైనా సిర్పూర్ నియోజక వర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి. బీజేపీ నుండి పాల్వాయి హరీష్ బాబు, కాంగ్రెస్ నుండి రావి శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. బీఎస్పీ నుండి ఏకంగా ఆ పార్టీ అద్యక్షుడు మాజీ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. నలుగురు బలమైన అభ్యర్థులు బరిలో నిలుస్తుండటంతో సిర్పూర్‌లో చితుర్ముఖ పోటీ నెలకొంటోంది.
గత లెక్కలను దృష్టిలో పెట్టుకుని బహుజన నినాదంతో బరిలోకి నిలిచి గెలవాలని బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు ప్రవీణ్ కుమార్ భావిస్తుండగా.. బీజేపీ హిందూత్వ నినాదంతో ఆరె మరాఠా ఓటర్ల ఆశీస్సులతో గెలిచి నిలుస్తామని బావిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనప్ప మాత్రం జనమే తన బలమని.. ఆ బలమే మరోసారి ఎమ్మెల్యే గా గెలిచేలా ఆశీస్సులు ఇస్తుందంటున్నారు.
కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలోని నియోజక వర్గం సిర్పూర్. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1989 వరకు ఈ నియోజక వర్గం కాంగ్రెస్ , తెలుగు దేశం పార్టీలకు కంచుకోటగా కొనసాగింది. 1989లో ఇండిపెండెంటుగా పోటీచేసిన పాల్వాయి పురుషోత్తమరావు ఘనవిజయం సాదించడంతో ప్రధాన పార్టీలకు చెక్ పడింది. 1994 లోనూ ఇండిపెండెంట్‌గానే బరిలో నిలిచి గెలిచారు పాల్వాయి పురుషోత్తమ రావు. ఆ తరువాత 1999 ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టుల దాడిలో పాల్వాయి పురుషోత్తమ రావు మరణించడంతో ఆయన స్థానంలో టీడీపీ తరుపున బరిలోకి దిగిన ఆయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి విజయం సాధించారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ తన సత్తాను చాటి 2004 లో కోనేరు కోనప్ప రూపంలో విజయ ఢంకా మోగించింది.
తెలంగాణ ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్న 2009 సమయంలో టీఆర్ఎస్ నుండి సిర్పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కావేటి సమ్మయ్యను ఇక్కడి జనం గెలిపించుకున్నారు. ఏడాదికే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉప ఎన్నికలు రావడం.. రాజీనామా చేసి బరిలోకి దిగిన సమ్మయ్య 2010 లో జరిగిన ఉప ఎన్నికలలోనూ మరోసారి విజయ కేతనం ఎగురవేశారు. ఆ తరువాత తెలంగాణ సిద్దించడంతో ముచ్చటగా మూడోవసారి పోటీకి సిద్దమైన సమ్మయ్య ఈసారి కూడా తనదే విజయం పక్కా అనుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి టికెట్ దక్కపోవడంతో బీఎస్పీ పార్టీ నుండి బరిలోకి దిగిన కోనేరు కోనప్ప 8,837 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ వెంటనే అధికార పార్టీ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు కోనేరు కోనప్ప.
2018 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గా బరిలోకి దిగిన కోనేరు కోనప్ప 83,088 ఓట్లు దక్కించుకున్నారు. సమీప అభ్యర్థి పాల్వాయి హారీష్ బాబుకు 59,052 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 24 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాదించారు కోనప్ప. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్ట కోనేరు కోనప్ప మేనల్లుడు రావి శ్రీనివాస్ ఈ ఎన్నికలలో బీఎస్పీ నుండి పోటీ చేసి కేవలం 5,379 ఓట్లతో సరిపెట్టుకున్నాడు.
సిర్పూర్ నియోజక వర్గం బెజ్జూర్, చింతల మానపల్లి , దహెగాం , కాగజ్ నగర్ , కౌటాల , పెంచికల్ పేట , సిర్పూర్ ( టి )లతో ఏడు మండలాలతో కొనసాగుతోంది. ఈ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2,22,973 మంది. ఇందులో మహిళలు 1,11,039, పురుషులు 1,11,924. జనరల్ రిజర్వుడు గా ఉన్న ఈ నియోజక వర్గంలో ఆరె ( బీసీ ) కులస్తులదే అగ్ర స్థానం. ఇక్కడ వారి ఓటర్ల సంఖ్య 40 వేల పై చిలుకు. ఆ తరువాత స్థానం మున్నూరు కాపులది 30 వేల ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఎస్సీల ఓట్ షేర్ 20 శాతం పైనే. టౌన్ లో మైనార్టీ ఓటర్ల బలం ఎక్కువగా ఉండగా గ్రామీణ ప్రాంతాలలో బీసీ , ఎస్సీ , ఎస్టీ ఓటర్ షేర్ 48 శాతం పైనే.
సిర్పూర్ పేపర్ మిల్ పునః ప్రారంభంతో కాగజ్ నగర్ పారిశ్రామిక ప్రాంతానికి పనుల కోసం వలస వచ్చిన బీహార్ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , జార్ఖాండ్ కూలీలతో మినీ ఇండియాగా కొనసాగుతోంది ఈ నియోజక వర్గం. స్వాతంత్ర్యానికి ముందు కాందిశీకులుగా వలస వచ్చిన బెంగాలీలు నియోజక వర్గంలోని మూడు మండలాల్లో స్థిర నివాసం ఏర్పర్చుకుని 10 శాతం పైగా ఓట్ షేర్ తో జయపజయాలను శాసిస్తున్నారు. ఆరె, మున్నూరు కాపు, మైనార్టీలు ఎవరి వైపు మొగ్గు చూపితే ఇక్కడ వారిదే విజయంగా తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్