Beer Price: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణలో అక్కడ ఒక్కో బీర్ రూ.290.. బాదుడే బాదుడు

తెలంగాణలో అక్కడ మద్యం ధరలను ఒక్కసారిగా వ్యాపారులు పెంచేశారు. మందుబాబుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. వ్యాపారులు అందరూ ఒక్కటై అనధికారికంగా ధరలను పెంచేశారు. దీంతో మందుబాబులకు షాక్ తప్పడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలు చూస్తే..

Beer Price: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. తెలంగాణలో అక్కడ ఒక్కో బీర్ రూ.290.. బాదుడే బాదుడు
Beer

Updated on: Jan 25, 2026 | 5:31 PM

తెలంగాణలో ప్రస్తుతం ఒక్కో లైట్ బీర్ ధర రూ.180గా కొనసాగుతోంది. ఇక స్ట్రాంగ్ బీర్ ధరలు బ్రాండ్‌ను బట్టి రూ.190 నుంచి రూ.260 వరకు ఉన్నాయి. అయితే అక్కడ మాత్రం ఏకంగా లైట్ బీర్ రూ.250కి విక్రయిస్తుండగా.. స్ట్రాంగ్ బీర్లను రూ.290కి విక్రయిస్తున్నారు. ఇక బీర్లే కాకుండా విస్కీ, బ్రాందీ, రమ్ లాంటి మిగతా మద్యం ధరలను పెంచేశారు. దాదాపు ఒక్కొ క్వార్టర్‌పై రూ.50 పెంచారు. దీంతో మందుబాబులు షాక్ అవుతున్నారు. ఇంతకు ఇదెక్కడ..? ఎందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు..? ఇలా ధరలను పెంచి విక్రయించడానికి కారణాలేంటి..? అనే విషయాలు చూద్దాం.

ఒక్కొ బీర్ రూ.290

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు ఈ నెల 31 వరకు ప్రధాన జాతర జరగనుంది. అయితే ఇప్పటినుంచే భక్తులు మేడారం వెళ్లి ముందస్తు మెక్కులు చెల్లించుకుంటున్నారు. బెల్లం సమర్పించి బంగారు మెక్కులు సమర్పిస్తున్నారు. దీంతో జాతరకు పది రోజుల ముందు నుంచే మేడారంకు భక్తుల తాకిడి పెరిగింది. జాతర క్రమంలో మద్యంకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో మందు ధరలను స్థానిక వ్యాపారులు పెంచేసి విక్రయిస్తున్నారు. ఒక సిండికేట్‌గా ఏర్పడి అనధికారికంగా ధరలను అమలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. సాధారణ ధరలతో పోలిస్తే ఏకంగా రూ.100 ఎక్కువ చేసి అమ్ముతున్నారు. దీంతో మందుబాబులకు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

క్వార్టర్‌పై రూ.50 పెంపు

ఒక్కో లైట్ బీర్‌ను రూ.250కి అమ్ముతుండగా.. స్ట్రాంగ్ బీర్‌ను రూ.290కి విక్రయిస్తున్నారు. ఇక మిగతా మద్యంపై క్వార్టర్‌పై రూ.50 ఎక్కువ వసూలు చేస్తున్నారు. జాతర కారణంగా మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం 22 తాత్కాలిక మద్యం షాపులకు అనుమతులు మంజూరు చేసింది. 9 రోజుల పాటు వీటికి పర్మిషన్ ఇచ్చింది. ఇక బెల్ట్ షాపులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఇక్కడ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు. కేవలం అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తే చాలనే భావనలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు తప్పితే చర్యలు తీసుకోవడం లేదని మందుబాబులు వాపోతున్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.