
Telangana: టైఫాయిడ్ వ్యాధి తెలంగాణలో నిశ్శబ్దంగా ప్రమాదకర రూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల గణాంకాలు చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అధికారిక రికార్డులు ఈ అంశాన్ని దేశ దృష్టికి తీసుకొచ్చాయి. 2023 ఏడాదికి సంబంధించిన మరణ కారణాల ధృవీకరణ నివేదిక ప్రకారం.. దేశంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా వెయ్యికి పైగా ప్రాణనష్టాలు నమోదయ్యాయి. ఈ మరణాల్లో తెలంగాణ వాటా అత్యధికంగా ఉండటం గమనార్హం. మొత్తం దేశవ్యాప్తంగా నమోదైన ప్రతి ఐదు టైఫాయిడ్ మరణాల్లో ఒకటి తెలంగాణలోనే చోటుచేసుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. సంఖ్యల పరంగా చూస్తే.. ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత అత్యధిక టైఫాయిడ్ మరణాలు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్ర జనాభా దేశ జనాభాలో చాలా తక్కువ శాతమే అయినప్పటికీ, మరణాల వాటాలో మాత్రం అసమాన స్థాయిలో ముందుండటం ఆరోగ్య రంగంలో తీవ్ర హెచ్చరికగా మారింది.
వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం.. టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం సాల్మొనెల్లా టైఫీ అనే సూక్ష్మజీవి. ఇది ఎక్కువగా అపరిశుభ్రమైన నీరు, ఆహారం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా తాగునీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, పాత పైపులైన్ల లీకేజీలు, మరమ్మతుల సమయంలో మురుగునీరు కలవడం వల్ల ఈ బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెందుతోంది. ఇంకోవైపు పట్టణాలు, నగరాల్లో నియంత్రణ లేని వీధి ఆహార కేంద్రాలు కూడా టైఫాయిడ్‌కు బలమైన మూలంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా తయారయ్యే ఆహారం, కలుషిత నీటితో వండే వంటకాలు వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.
మురికివాడల్లో సరైన పారిశుద్ధ్య వ్యవస్థలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతోంది. టైఫాయిడ్ విషయంలో ప్రజల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యం మరో పెద్ద సమస్యగా మారింది. జ్వరం వచ్చినా సాధారణ వైరల్‌గా భావించి చికిత్సను వాయిదా వేయడం, డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం వల్ల పరిస్థితి తీవ్రమవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే పేగులకు తీవ్ర నష్టం, రక్తంలో ఇన్ఫెక్షన్, అంతర్గత అవయవాల వైఫల్యం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరో ఆందోళనకర అంశం ఏమిటంటే.. టైఫాయిడ్ చికిత్సలో వాడే కొన్ని సాధారణ యాంటీబయాటిక్స్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం. మందులకు ప్రతిఘటన పెరుగుతుండటం వల్ల చికిత్స మరింత క్లిష్టంగా మారుతోందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇది మరణాల సంఖ్య పెరగడానికి కారణంగా మారే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే ప్రజల జాగ్రత్తలతో పాటు ప్రభుత్వ చర్యలు కూడా సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నీటిని మరిగించి తాగడం, తాజాగా తయారైన వేడి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత కీలకమని చెబుతున్నారు. అలాగే టైఫాయిడ్ ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పారిశుద్ధ్య పనులను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి