
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై క్రాంతి కుమార్ మానవత్వం మరిచి ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపింది. ఝరాసంగం మండలం ఎల్లోయి గ్రామానికి చెందిన నరసమ్మ అనే వృద్ధురాలు పొలం పనులకు వెళ్తుండగా కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలోని బంగారు గొలుసు, వెండి ఆభరణాలను లాక్కొని పారిపోయారు. ఈ చైన్ స్నాచింగ్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు నరసమ్మ పోలీస్ స్టేషన్‌కు రాగా, ఎస్సై క్రాంతి కుమార్ వింతగా ప్రవర్తించారు. అసలు దొంగతనమే జరగలేదంటూ బాధితురాలితో వాదనకు దిగారు.
అంతటితో ఆగకుండా, ఘటన జరిగిన స్థలాన్ని చూపిస్తానంటూ వృద్ధురాలిని విచారణ పేరుతో పోలీస్ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు. కానీ, ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమె మాట వినకుండా నడి అడవిలోనే వదిలేసి ఎస్సై తిరిగొచ్చారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధురాలు అడవిలో ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటూ, ఎలాగోలా కాలినడకన గ్రామానికి చేరుకుంది.
ఎస్సై చేసిన ఈ అమానుష చర్య గురించి తెలుసుకున్న ఎల్లోయి గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఎస్సై క్రాంతి కుమార్ తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో మహిళలు ఝరాసంగం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఎట్టకేలకు స్థానిక పోలీసులు దిగొచ్చారు. వృద్ధురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేయడంతో మహిళల ఆందోళన తాత్కాలికంగా ముగిసింది. బాధితుల పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.