
ఒకే ఒక్క ఓటమితో వడదెబ్బ తగిలిన గులాబీలా వాడిపోయింది..బీఆర్‌ఎస్ పార్టీ. గేట్లు ఎత్తిన కాంగ్రెస్‌లోకి గుంపులుగా చేరిపోతున్నారు..బీఆర్‌ఎస్ నేతలు. దీంతో అంతర్మధనం మొదలుపెట్టారు గులాబి నేతలు. అధికారం కోసం వచ్చిన నేతల స్థానంలో..నిఖార్సైన నాయకులను తయారు చేస్తామంటున్నారు. మరి అది సాధ్యమేనా..? జెండామోసిన అసలు నేతలకు ఇప్పటికైనా అవకాశం లభిస్తుందా..? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న చర్చ.
అప్పటి ఉద్యమ పార్టీ నుండి ఇప్పుడు ఉద్యమంలా వలసలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వెల్లువలా తరలివచ్చిన నేతలు అధికారం పోగానే అంతే వేగంగా కారు దిగేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీఛైర్‌పర్సన్లు మొదలుకుని కిందిస్థాయి నేతలు సైతం గులాబిపార్టీని వీడి హస్తం గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిపేందుకు అభ్యర్థులు సైతం కరువైన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్‌ఎస్ టికెట్ అంటే యమ క్రేజ్. పార్టీ టికెట్ ఇస్తే చాలు.. గెలుపు ఖాయమనే ధీమా. కాని 2023లో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో టికెట్ల కోసం ప్రగతి భవన్ చుట్టూ క్యూ కట్టే పరిస్థితి ఉంటే..ఇప్పుడు టికెట్ దక్కిన నేతలు సైతం పార్టీ తరఫున పోటీ చేయలేమంటూ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి.
అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందనే దానిపై రాష్ట్రంలో జరుగుతున్నది ఒకే ఒక్క చర్చ. ప్రత్యేక రాష్ట్రసాధనలో, అప్పటి నుంచి టీఆర్‌ఎస్ ప్రస్థానంలో జెండా పట్టినవాళ్లకు కాకుండా.. జెండా నీడన సేదదీరేందుకు వచ్చిన వాళ్లకే ఎక్కువ అవకాశం ఇచ్చందన్నదీ కేడర్ వాదన. క్షేత్రస్థాయిలో పార్టీకి అండగా ఉన్న వాళ్లకు పదేళ్లపాటు అన్యాయం జరిగిందని అనేక మంది నేతలు బహిరంగంగానే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సమీక్షల్లో 80% కేడర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఈ మాటలను పెద్దగా పట్టించుకోని అధిష్ఠానానికి ఇప్పుడు మెల్లగా తత్వం బోధపడుతోంది. అందుకే, ఇకపై నిఖార్సైన కొత్త తరం నాయకత్వాన్ని సిద్ధం చేస్తామని చెబుతున్నారు ఆ పార్టీ అగ్రనేతలు.
పార్టీలోకి వచ్చీరాగానే కేకే, కడియం లాంటి వ్యక్తులకు ముఖ్యమైన పదవులు కట్టబెట్టింది బీఆర్‌ఎస్ పార్టీ. కానీ కష్టంలో ఉన్నప్పుడు వాళ్లు వదిలి వెళ్లిపోవడం చూసి జీర్ణించుకోడానికి ఇబ్బంది పడుతోంది. పూటకో ఘటన, రోజుకో వలస కళ్లముందు కనిపిస్తుంటే.. నాలుగు నెలల క్రితం కేడర్ చెప్పిన మాటలను నెమరవేసుకోక తప్పడం లేదు. అందుకే పోనీ పోనీ పోతే పోనీ అన్నట్లు.. అగ్రనేతలు మానసికంగా సిద్ధమైపోయారు. రియలైజ్ అయ్యారో ఏమోగానీ.. ఇకనైనా నిఖార్సైన నేతలను తయారుచేసుకుంటాం అంటున్నారు పార్టీ లీడర్స్.
అధికారంలో ఉన్న పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాసించింది బీఆర్‌ఎస్. కానీ ఒక్క ఓటమి.. ఆ పార్టీ పరిస్థితిని తలకిందులు చేసేసింది. పదేళ్లపాటు అధికారం అనుభవించిన నేతలు.. కష్టకాలంలో నిర్ధాక్షణ్యంగా వదిలివెళ్లిపోతున్నారు. అయితేనేం, ఎన్నో ఒడిదొడుకులు చూసిన హైకమాండ్ మళ్లీ మొదలుపెడతాం అన్నట్లు ధీమాగా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న పరిస్థితి ఉంటే ఉండొచ్చు గానీ, ఇప్పటికైనా జెండా మోసిన వాళ్లకు న్యాయం జరగాలన్నదే కేడర్ ఆకాంక్ష..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…