తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయలతోపాటు రాబోయే రోజుల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత రాబోయే రోజుల్లో ఏం చేస్తారో కూడా చెప్పారు. వచ్చే నెల నుంచి చేయనున్న యాత్ర గురించి కూడా చెప్పారు. తెలంగాణలో వచ్చేది హంగ్ ప్రభుత్వం అంటూ తేల్చి చెప్పారు. ఎవరికీ కూడా 60 సీట్లకు మించి రావన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ తో నడవక తప్పదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గాడిలో పడుతుందన్నారు. తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీనే.. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని తేల్చి చెప్పారు. ఆ రెండు పార్టీలు క్యాష్ రిచ్ పార్టీలు.. వాటితో పోటీ పడాలన్నారు.
మా పార్టీకి తెలంగాణ ఇచ్చిన పేరుంది.. కానీ సీనియర్లు అందరూ ఒక వేదిక మీదకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కష్టపడి తలా కొన్ని సీట్లు గెలిపిస్తే పార్టీకి 40-50 సీట్లు వస్తాయన్నారు. నేనే గెలిపిస్తా అంటే పని జరగదన్నారు. ఆయన గెలిపిస్తా అన్నారు కదా అని మిగతావారు చూస్తూ కూర్చుంటారు.. ఆయనెవరో పేరు చెప్పాల్సిన పని లేదన్నారు. మాణిక్ రావ్ థాకరే చాలా సీనియర్ నేత.. ఆయన అందరికీ మర్యాద ఇస్తున్నారు. చాలా ఓపికగా అందరి మాట వింటున్నారు. మాణిక్ రావ్ థాకరే వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాడిలో పడిందన్నారు.
సీఎం కేసీఆర్ బీజేపీని విమర్శించడం కోసం కాంగ్రెస్‌ను పొగడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ను పొగడాలంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గురించి కూడా చెప్పాలి కదా?.. మరి పొలిటికల్ డ్రామా కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్‌ను కూడా పొగడడం వెనుక కూడా ఇదే కారణమని.. ఈటల రాజేందర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మాణిక్యం టాగోర్ ఎప్పుడైనా ఏదైనా చెబుదామంటే ఫోన్ పట్టుకుని చూస్తుండేవారు. వినేవారు కాదన్నారు. అందరం కలిసి కష్టపడితే పార్టీ గెలిచే అవకాశం ఉంటుందన్నారు. నేను, నా మనుషులు అనుకుంటే 40 సీట్లు రావొచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు మాత్రమే గెల్చుకున్న సమయంలో 25 శాతం ఓట్లు వచ్చాయన్నారు. పార్టీలో గెలిచేవారికి టికెట్లు ఇవ్వాలి. వారు కొత్తవారైనా, పాతవారైనా సరే. తమవారికే టికెట్లు ఇవ్వాలనుకుంటే పార్టీ మునుగుతుందని జోస్యం చెప్పారు. పొత్తుల ప్రసక్తే లేదు.. పొత్తులకు మేం ఒప్పుకోం.. కాంగ్రెస్ ఒంటరి పోరాటమే అంటూ తేల్చి చెప్పారు.
పొత్తులు పెట్టుకుంటే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందన్నారు. ఫలితాల తర్వాత మరొకరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. జరిగేదే చెబుతున్నా.. మార్చి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తున్నట్లుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన అనంతరం కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం