Bhadradri Kothagudem district : టెన్త్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. బిడ్డ బాగా కష్టపడి చదువుతుందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా ఇంటికి వచ్చింది కుమార్తె. భయంతో ఏమైందని ఆత్రంగా అడిగారు పేరెంట్స్. ఒంట్లో బాగోడం లేదని.. పదే, పదే కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెలు బద్దలయ్యే న్యూస్ తెలిసింది. ఆ తర్వాత మరో విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం(Dummugudem Mandal) రామచంద్రునిపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలిక(16) టెన్త్ క్లాస్ చదువుతోంది. కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామం గెద్దమడుగుకు వచ్చింది. అకస్మాత్తుగా కూతురు ఇంటికి వచ్చేసరికి భయపడ్డ తల్లిదండ్రులు.. ఏం జరిగిందని ఆరాతీశారు. కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో తొలుత గ్రామంలోని భూత వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అతడు కడుపులో గడ్డ ఉంది ఆస్పత్రిలో చూపించాలని కుటుంబసభ్యులకు సూచించాడు. దీంతో భద్రాచలం(Bhadrachalam) ఆస్పత్రిలో టెస్టులు చేసిన అనంతరం డాక్టర్లు చెప్పిన మాటలు విని కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ప్రస్తుతం బాలిక నాలుగో నెల గర్భిణి అని చెప్పారు. దీంతో వారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బాలికపై గట్టిగా కేకలు వేశారు. ఇందుకు కారణం ఎవరంటూ నిలదీశారు. దీంతో భయపడిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఈనెల 27న మృతి చెందింది. ఈ వ్యవహారంలో పాఠశాల సిబ్బంది ప్రమేయం ఉందా.. లేక బయటి వ్యక్తుల పనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hyderabad: ఆన్‌లైన్‌లో మ్యాక్‌బుక్ ఆర్డర్ పెట్టిన యువకుడు.. పార్శిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే షాక్