Nizamabad, October 10: దొంగలది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన దోపిడి.. స్టైల్ ఏదైనా.. ప్లాన్ ఏదైనా.. టార్గెట్ మాత్రం దోచుకోవడమే. అయితే, వారు వేసిన అన్ని ప్లాన్స్ సక్సెస్ కావు.. కొన్ని సందర్భాల్లో అట్టర్ ప్లాప్ కూడా అవుతాయి. తాజాగా అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో ఫేస్ చేశారు కొందరు దొంగలు. చిన్నా చితకా చోరీలతో లాభం లేదనుకున్నారో ఏమో గానీ.. ఏకంగా ఏటీఎంనే టార్గెట్ చేసుకున్నారు. కానీ, ఆ ప్రయత్నం ఫెయిల్ అయి.. చెప్పులు చేత పట్టుకుని పరుగో పరుగు అంటూ లంఘించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలం అంక్సాపూర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అంక్సాపూర్‌లో గల యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీకి కొందరు దుండగులు ప్రయత్నించారు. ఎటీఎంలో ధ్వంసం చేసే అందులోని డబ్బులు తీసుకెళ్లాని ప్రయత్నించారు. అయితే, అది సాధ్యపడకపోవడంతో.. ఏకంగా ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో కొందరు స్థానికులు ఆ చోరీని గమనించారు. పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వేయడంతో దొంగలు బెదిరిపోయారు. ఏటీఎం మెషీన్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చి క్లూస్ సేకరించారు. ఏటీఎం మెషీన్‌లో సుమారు రూ. 40 లక్షలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, జిల్లాలో రహదారులపై ఉన్న ఏటీఎం పై దొంగలు కన్ను వేసినట్లు తెలుస్తోంది. గత 15 రోజుల్లో ఏటీఎం చోరీకి పాల్పడటం ఇది 3వ ఘటన. రోడ్డు పక్కన, సెక్యూరిటీ లేని, జన సంచారం పెద్దగా లేని ఏటీఎం కేంద్రాలే టార్గెట్‌గా కేటుగాళ్లు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..